RCB Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనలో షాకింగ్‌ ట్విస్ట్‌.. RCBపై కేసు నమోదు!

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ప్రస్తుతం పీకల్లోతు వివాదంలో చిక్కుకుంది. ఆర్సీబీ టైటిల్‌ సాధించిన తర్వాత బుధవారం (జూన్‌ 4) బెంగళూరులో జరిగిన విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏకంగా 11 మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. 50కిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది..

RCB Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనలో షాకింగ్‌ ట్విస్ట్‌.. RCBపై కేసు నమోదు!
Case Filed Against RCB

Updated on: Jun 05, 2025 | 7:28 PM

బెంగళూరు, జూన్‌ 5: ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకున్న ఆనందం ఆర్సీబీకి ఏమాత్రం లేకుండా పోయింది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ప్రస్తుతం పీకల్లోతు వివాదంలో చిక్కుకుంది. ఆర్సీబీ టైటిల్‌ సాధించిన తర్వాత బుధవారం (జూన్‌ 4) బెంగళూరులో జరిగిన విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏకంగా 11 మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. 50కిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన నేడు మరో కీలక మలుపు తిరిగింది. బెంగళూరు పోలీసులు.. రాష్ట్ర క్రికెట్ సంస్థ RCB, KSCAపై సుమోటో కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఏజీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కార్యక్రమం నిర్వహించిన ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్‌ అసోసియేన్‌లపై బీఎన్‌ఎస్‌లోని 5 సెక్షన్ల కింద కర్ణాటక పోలీసులు కేసు బుక్‌ చేశారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన పోలీసులు.. ఈ మేరకు ఆర్సీబీ, కేఎస్‌సీఏలపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం నియమించిన జిల్లా మేజిస్ట్రేట్ జి జగదీశ.. KSCA, RCB ఫ్రాంచైజీలకు నేడు (జూన్‌ 5) నోటీసులు పంపనున్నారు. విచారణ జరిపి నివేదికను 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు విశ్లేషిస్తామని, ఇందులో భాగంగా మరణించిన, గాయపడిన వారి కుటుంబాల వాంగ్మూలాలను సేకరిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ జగదీశ చెప్పారు. జూన్ 13న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సాధారణ ప్రజలు కూడా తమ వాంగ్మూలాలు ఇవ్వవచ్చని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఆర్‌సీబీ IPL విజయోత్సవ వేడుకల సందర్భంగా మోహరించిన పోలీసుల జాబితాను సైతం తయారు చేసి, వారి వాంగ్మూలాలు కోరతామని ఆయన తెలిపారు.

ఆర్సీబీ జట్టును బెంగళూరు తీసుకురావాలని మేం కోరలేదు.. కర్ణాటక హోంమంత్రి

మరోవైపు విజయోత్సవాలకు ఆటగాళ్లను బెంగళూరుకు తీసుకురావాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం కాదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు. ఈ విషయంలో మేము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకిగానీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ఎటువంటి అభ్యర్థన చేయలేదన్నారు. వారే విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని మంత్రి పరమేశ్వర తెలిపారు. వేడుకల కోసం RCB జట్టును KSCA బెంగళూరుకు తీసుకువచ్చినట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర మీడియాకు తెలిపారు. ఈ కేసును సమగ్ర దర్యాప్తు కోసం CIDకి అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.