
బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని కానిస్టేబుల్ బ్యారక్స్‌లో డయల్ 112 విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం (అక్టోబర్ 11) ఉదయం వేళ జరిగిన ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతుడిని భాగల్పూర్ జిల్లాకు చెందిన సమీర్ కుమార్‌గా గుర్తించారు. ఆయన కిషన్‌గంజ్ జిల్లాలో డయల్ 112 అత్యవసర సేవల విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని బ్యారక్స్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పుల శబ్దం వినిపించడంతో బ్యారక్స్‌లో ఉన్న తోటి పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న సహచరులు తీవ్రంగా గాయపడిన సమీర్‌ను చికిత్స నిమిత్తం సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు పరీక్షించిన అనంతరం ఆయన మరణించినట్లు ప్రకటించారు.
కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూనే..!
కాల్పులు జరగడానికి కొద్దిసేపటి ముందు సమీర్ తన భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, ఆ సంభాషణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఆయన చివరిసారిగా ఎవరితో మాట్లాడారు? ఆ సమయంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రంగంలోకి ఫోరెన్సిక్ బృందం
W ఘటన గురించి తెలుసుకున్న కిషన్‌గంజ్ జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ సదర్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించింది. బ్యారక్స్ నుంచి కేసింగ్‌తో పాటు సమీర్‌కు చెందిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షకు పంపించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు కిషన్‌గంజ్‌కు చేరుకున్నారు.
కుటుంబ కలహాలా.. విధుల ఒత్తిడా?
సమీర్ మృతికి కుటుంబ సమస్యలు లేదా మానసిక ఒత్తిడి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు దారితీసిన కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలు, విధుల ఒత్తిడి, సెలవులకు సంబంధించిన సమస్యలు సహా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ వివరాలు, చివరి సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక, పోస్టుమార్టం ఫలితాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోస ఇక్కడ క్లిక్ చేయండి..