
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. 15 ఏళ్ల అధికారానికి బ్రేక్ పడటమే కాకుండా, అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఓడిపోవడంతో పార్టీపై ఆమె పట్టు సడలుతోంది. తాజాగా టీఎంసీ కీలక నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాజీనామా అనంతరం ఆమె అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో భేటీ కావడం, ఆమె త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారానికి బలం చేకూర్చింది. సుష్మితా దేవ్‌కు ముందే సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ కూడా రాజ్యసభకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
పార్లమెంట్‌లో చీలక వైపు టీఎంసీ?
ఇప్పటికే రాష్ట్రంలో రీతబ్రత బెనర్జీ నేతృత్వంలో 61 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు ఎంపీలు కూడా అదే బాట పట్టారు. ఎన్డీఏ (NDA) కూటమిలో చేరేందుకు సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని రెబెల్ ఎంపీ కాకోలీ ఘోష్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా లేఖ సమర్పించారు. మరోవైపు, రెబెల్ గ్రూప్‌లో ఉన్న ఎంపీ పార్థ భౌమిక్ తన అధికారిక నివాసంలో నడుస్తున్న టీఎంసీ ఢిల్లీ కేంద్రీయ కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని అభిషేక్ బెనర్జీకి లేఖ రాయడం పార్టీలో తిరుగుబాటు తీవ్రతను స్పష్టం చేస్తోంది.
తిరుగుబాటు వర్గంపై టీఎంసీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ నచ్చని వారు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని, నైతికత ఉంటే కాకోలీ ఘోష్ తనతో ఉన్న ఆ 20 మంది ఎంపీల పేర్లను బహిరంగపరచాలని సవాల్ విసిరారు. పార్లమెంట్‌లో ప్రత్యేక కూటమిగా ఏర్పడటానికి అవసరమైన 19 మంది ఎంపీల మద్దతును రెబెల్స్ కూడగట్టలేరని మమత వర్గం గట్టి నమ్మకంతో ఉంది.
మరోవైపు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు, టీఎంసీలో తీవ్రవాదిగా పేరుగాంచిన సయానీ ఘోష్ కూడా తిరుగుబాటు చేశారని తెలుస్తోంది ఈ తిరుగుబాటు బృందంలో సయానీ ఘోష్, సుదీప్ బందోపాధ్యాయ్‌తో సహా 20 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారని వర్గాలు తెలియజేస్తున్నాయి. తాజాగా ఇద్దరు రాజ్యసభ ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్ కూడా రాజీనామా చేశారు. సయానీ ఘోష్ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి టీఎంసీ ఎంపీగా ఉన్నారు.
ఓటమి భారంతో కుంగిపోయిన మమతా బెనర్జీకి వరుసగా తగులుతున్న ఈ ఎదురుదెబ్బలు కోలుకోలేనివిగా మారాయి. ఇప్పుడు తిరుగుబాటుదారుల లేఖపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకోబోయే నిర్ణయంపైనే టీఎంసీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..