Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ యాత్రపైనే కర్ణాటక కాంగ్రెస్ ఆశలు.. భారత్ జోడో యాత్రకు ఘన స్వాగతం..

కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఆపార్టీ భారీ ఆశలు పెట్టకుంది. ఈ యాత్ర ద్వారా తమ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే ఆశతో హస్తం పార్టీ శ్రేణులు ఉన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన..

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ యాత్రపైనే కర్ణాటక కాంగ్రెస్ ఆశలు.. భారత్ జోడో యాత్రకు ఘన స్వాగతం..
Rahul Gandhi Bharat Jodo Yatra
Follow us

|

Updated on: Sep 30, 2022 | 1:19 PM

కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఆపార్టీ భారీ ఆశలు పెట్టకుంది. ఈ యాత్ర ద్వారా తమ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే ఆశతో హస్తం పార్టీ శ్రేణులు ఉన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈయాత్ర రెండు రాష్ట్రాలు పూర్తిచేసుకుని మూడో రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. తమిళనాడు, కేరళలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర పూర్తైంది. సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర అడుగుపెట్టింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అయితే భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. మొత్తం మీద గాంధీయేతర కుటుంబం నుంచే పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలనే కృతనిశ్చయంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే గాంధీ కుటుంబం నుంచి కాకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని అధిష్టానం యోచిస్తోంది. దీనిలో భాగంగానే పలువురు నేతలతో నామినేషన్లను కాంగ్రెస్ అధిష్టానం వేయిస్తోంది.

మొదట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతారనే ప్రచారం జోరుగా సాగినప్పటికి అతడి ప్రవర్తనతో చివరికి.. ఎన్నికల పోటీ నుంచే తప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేయడం ద్వారా కుటుంబ పార్టీ ముద్రను తొలగించుకుని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కొట్టాడేందుకు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ వ్యూహాలను బట్టి తెలుస్తోంది. మొత్తం మీద భారత్ జోడో యాత్ర సమయంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 30(శుక్రవారం) భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించింది. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలోశాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి రావడంతో పాటు.. రాహుల్ గాంధీ యాత్ర కూడా తమకు లబ్ధి చేకూరుస్తుందనే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కర్ణాటకలోని బందీపూర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య స్వాగతం పలికారు. ఈ యాత్ర ద్వారా దేశాన్ని రక్షించుకోవడానికి ప్రతి భారతీయుడిని ఏకతాటిపైకి తీసుకురావడానికి దోహదపడుతుందని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో దాదాపు 40,000 ఉంచి 45,000 మంది రోజూ పాల్గొంటారని సిద్ధరామయ్య అంచనా వేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ప్రవేశించిన నేపథ్యంలో ఆరాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డీకే.శివకుమార్ మాట్లాడుతూ.. సమైక్య ప్రతిజ్ఞను తమ పార్టీ పునరుద్ధరిస్తుందన్నారు. మార్పును కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చారు. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం రావడానికి దేశం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ఐక్యం చేసిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మార్పు కోసం మళ్ళీ ఐక్యతా ప్రతిజ్ఞను పునరుద్దరిస్తున్నామని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వాన్ని హస్తం పార్టీ టార్గెట్ చేసింది. ప్రభుత్వ అవినీతిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. ఇదే సందర్భంలో ఈ దేశం అవినీతితో బతకాల్సిన అవసరం లేదని, నిరుద్యోగంతో బాధపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం సృష్టించగల శక్తి దేశానికి ఉందని తాము విశ్వసిస్తున్నామని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పేర్కొన్నారు.

కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ప్రవేశించడంతో బీజేపీ కూడా రాహుల్ గాంధీ టార్గెట్ గా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు మీ ఘనతే కారణమంటూ బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న అన్ని రోజులు ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు కర్ణాటకలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుందన్న ఒక రోజు ముందు రాహుల్ గాంధీకి స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం కూడా రాజకీయ దుమారాన్ని లేపింది. ఈఘటనపై కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..