
తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ 108 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన విజయ్ (TVK), ఇప్పుడు అధికార పీఠం కంటే అలయెన్స్ రాజకీయం ఎంత కఠినంగా ఉంటుందో రుచి చూస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం పది అడుగుల దూరంలో ఆగిపోవడం విజయ్‌కు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. గత ఐదు రోజులుగా మద్దతు కోసం వీసీకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే, విజయ్‌ను ద్రవిడ పార్టీలు ఇప్పుడే ఆడుకోవడం మొదలుపెట్టాయనిపిస్తోంది.
తమిళనాడులో ద్రవిడ మోడల్ రాజకీయం అంటే కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు.. అది కులం, క్యాడర్, బూత్ లెవల్ మైక్రో మేనేజ్‌మెంట్‌తో పెనవేసుకుపోయిన వ్యవస్థ. 108 సీట్లతో గెలిచిన విజయ్‌కు, ఈ ఐదు రోజుల్లోనే వ్యవస్థ లోతు అర్థమైంది. ముఖ్యంగా VCK వంటి పార్టీలు రెండు రోజులుగా ఆడుతున్న నాటకీయ పరిణామాలు పీక్స్‌కు చేరాయి. చివరికి మద్దతు ప్రకటించినా, అది నిబంధనలతో కూడిన మద్దతుగా కనిపిస్తోంది.
అయినా ఇది చెప్పుకున్నంత ఈజీకాదు. కేవలం రెండు సీట్లున్న పార్టీలు గొంతెమ్మ కోరికలతో ముందే విజయ్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయంటే మున్ముందు సినిమా అంత ఈజీగా ఉండదని ఈపాటికే టీవీకే అధినేతకు అర్ధమయ్యే ఉంటుంది. మునుముందు విజయ్ మరెన్నో సవాళ్ళు ఎదుర్కొవల్సి వస్తుందో అన్న చర్చ మొదలైంది. కీలక నిర్ణయాల్లో మద్దతు పార్టీల జోక్యం తప్పనిసరి అవుతుంది. దీనివల్ల విజయ్ తన స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం కష్టతరం. చిన్న పార్టీలు తమ అజెండాల కోసం ఎప్పుడైనా మద్దతు ఉపసంహరించుకుంటామనే బెదిరింపులకు దిగే అవకాశం ఉంది. దశాబ్దాలుగా స్టాలిన్‌తో సంబంధాలున్న పార్టీలు, ఇప్పుడు విజయ్ ప్రభుత్వంలో ఉంటూ డీఎంకే ప్రయోజనాలను కాపాడే ప్రమాదం ఉంది.
ఎన్నికల ముందు మార్పు అని గొంతెత్తిన విజయ్‌కు, ఇప్పుడు పాత పద్ధతుల్లోనే రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి పదవుల పంపకం నుంచి పాలసీ నిర్ణయాల వరకు ప్రతి అడుగులోనూ మద్దతు పార్టీల సమ్మతి కోరాల్సి రావడం ఆయన క్లీన్ పాలిటిక్స్ ఇమేజ్‌కు డ్యామేజే. ముఖ్యంగా హోమ్, ఫైనాన్స్ వంటి కీలక శాఖలపై మిత్రపక్షాల కన్ను పడటం విజయ్‌కు అతిపెద్ద తలనొప్పి.
ప్రస్తుతానికి కింగ్ మేకర్లుగా చలామణి అవుతున్న చిన్న పార్టీలకు చెక్ పెట్టాలంటే విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన నిర్ణయాల్లో మిత్రపక్షాల జోక్యం లేకుండా ముందే స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవాలి. హోమ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి కీలక శాఖలను TVK తన చేతుల్లోనే ఉంచుకోవాలి. మద్దతు పార్టీల మీద ఆధారపడకుండా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా గెలిచి తన బలాన్ని నిరూపించుకోవాలి. ప్రభుత్వం తీసుకునే విప్లవాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటే ఆ నష్టం వారికే కలిగేలా చేయాలని రాజకీయ పండితులు సూచిస్తున్నారు.
సినిమాలో క్లైమాక్స్ ఈజీగా ఉండొచ్చు కానీ, అసెంబ్లీలో మాత్రం విజయ్‌కు అసలైన సినిమా ఇప్పుడే మొదలైంది. కేవలం రెండు సీట్లు ఉన్న పార్టీలే విజయ్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయంటే, ఐదేళ్ల పాలన కత్తిమీద సామే. రాజకీయ పరిణితితో ఈ అలయెన్స్ చిక్కుముడులను విడదీసి, తన మార్కు పాలన చూపిస్తేనే విజయ్ నిజమైన “రాజకీయ సూపర్ స్టార్” అవుతారు. లేదంటే, ముఖ్యమంత్రిగా ఉన్నా రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతుల్లో ఉండే ప్రమాదం పొంచి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..