
డియర్ ఎన్టీయే.. నాకు 18 ఏళ్లు. నేను ఈ ఏడాది నీట్ 2026 పరీక్ష రాశాను. నా 12వ తరగతిలోనే నీట్ పరీక్ష కోసం శ్రమిస్తున్నాను. సోషల్ మీడియా దూరం పెట్టా. స్నేహితులతో మాట్లాడటం మానేశా. పార్టీలకు వెళ్లడం లేదు… నీట్‌లో ర్యాంకు కొట్టాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో నా తోబుట్టువులతో కూడ మాట్లాడలేదు. ఈ పరీక్ష కోసం ఎన్నో త్యాగాలు చేశాను.. దేనికోసం? అవును, కేవలం డాక్టర్ అవ్వాలనే నా కల.. నా కెరీర్‌ను నిర్మించుకోవడం కోసం ఇదంతా చేయించింది.
పరీక్ష సమీపిస్తున్న కొద్దీ నా ఆందోళన పెరిగసాగింది. అది సహజమే. ఆ తర్వాత పరీక్షకు సుమారు 10-12 రోజుల ముందు NTA విడుదల చేసిన ఓ ప్రకటన చదివి ఇంకా భయపడ్డాను. ఇది పాఠశాల పరీక్ష కాదు. ఇది జాతీయ స్థాయి వడపోత పరీక్ష. అది స్కూల్‌లో జరిగే పరీక్ష కాదు.. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే స్కూళ్లలో జరిగే పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం జరగదు. కానీ నీట్ పరీక్షలో పేపర్ లీకులు షరా మామూలై పోయింది. మేము మిగతా పరీక్షల కంటే పది అడుగులు ముందుగా ఉంటామని ఎన్టీయే చెప్పుకోవడం సిగ్గుచేటు. పరీక్ష కేంద్రం బయట మమ్మల్ని తనిఖీ చేయడంలో మీరు నిజంగానే పది అడుగులు ముందున్నారు. ఎందులోనో తెలుసా? ఎగ్జాం సెంటర్ల ముందు మమ్మల్ని తనికీల పేరిట అనేక అంచెలుగా చెక్ చేస్తారు చూడు.. ఆ విషయంలో మీ భద్రత ఉంటుంది. కానీ పరీక్ష కేంద్రాల వద్ద పెట్టే అంచెలంచెల సెక్యురిటీ ఎగ్జాం నిర్వహించే విషయంలో ఎందుకు పెట్టారు? నీట్ పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు మేము (విద్యార్ధులు) ఎంత బాధపడ్డామో తెలుసా? కనీసం లోపలికి ఒక ట్రాన్పరెంట్ వాటర్ బాటిల్‌ని కూడా అనుమతించలేదు. పర్వాలేదు. మా కలల కోసం మేము ఏదైనా చేస్తాం. ఎన్ని త్యాగాలైనా చేస్తాం. అయినా ఈ వేడిలో నోరెండి పోతున్నా, మా కలల సాకారం కోసం అన్ని భరిస్తాం. పరీక్ష కేంద్రం బయట తనిఖీ పేరిట జరిగే ప్రహసనం ఇంకా నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది.
తనిఖీల పేరుతో అమ్మాయిల జడలు విప్పించి, మహిళ సిబ్బంది చేతులతో మా వెంట్రుకల లోపల వేళ్లతో నిమిరిమరీ చెక్ చేశారు. జేబులు ఉంటే వారి టీ-షర్టులు, ప్యాంట్లను కూడా కత్తిరించారు. ఇదంతా నా కళ్ల ముందే జరిగింది. ఇదంతా చూశాక.. అసలు పేపర్ లీక్ స్టూడెంట్స్ చేస్తారేమోనన్న అనుమానం మీకు ఉన్నట్లుంది. అయినా ఇదంతా భరించాం. ఈ తనికీలన్నీ చూసి ఈసారి పేపర్ లీక్ జరగదులే అన్న నమ్మకంతో ఎగ్జాం రాయడానికి పరీక్ష కేంద్రంలోకి వెళ్లాను.
కానీ వాస్తవానికి ఏం జరిగింది? మాకు మిగిలిందేమిటి? ఈ లేఖ నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ప్రతీక. మా మాదిరి భవిష్యత్తులో ఇంకెవ్వరూ నష్టపోకూడదు. ఎన్టీయేని ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా.. పది అడుగులు ముందుండటం అంటే పేపర్ లీకేజీలోనా? అయినా పర్లేదు.. పరీక్ష రద్దు చేశారు కాబట్టి.. మళ్లీ చదువుతాం. మీరు తనిఖీల పేరుతో చేసే సెర్చింగ్ కూడా భరిస్తాం. కానీ ఇంత పెద్ద పరీక్ష పేపర్ లీకైనందుకు మీకు కనీసం పశ్చాత్తాపం అయినా ఉందా? లక్షల మంది విద్యార్ధుల ఆశలపై నీళ్లు చల్లారు. విద్యార్థులమైన మాకు కనీసం ఒక క్షమాపణ అయినా చెప్పాలని మీకు అనిపించడం లేదా?
మీకు ఓ విషయం అర్ధం కావడం లేదు. నీట్ పరీక్ష కోసం నేను, నాలాంటి లక్షలాది విద్యార్థులు ఎన్ని కలలు కన్నామో తెలుసా? పరీక్ష తర్వాత మా తోబుట్టువులతో సమయం గడపబోతున్నందుకు మేమంతా చాలా సంతోషించాం. కానీ కేవలం రెండు రోజుల తర్వాత పరీక్ష మళ్ళీ జరుగుతుందని తెలిసి షాకయ్యాం. వరదలో ఇల్లు కొట్టుకుపోయినట్లుగా మా ఆనందమంతా ఆవిరైపోయింది. పేపర్ లీకైన రోజు 11 ఏళ్ల వయసున్న నా చిన్న చెల్లెలు నాతో ఒక మాటఅంది. ‘అంతగా ఆశలు పెట్టుకోకు. భారత్‌లో మన భవిష్యత్తుపై ఎవరికీ శ్రద్ధలేదు’ అని చెప్పింది. ఆమె మనసులో అలాంటి ఆలోచనలు పుట్టేలా చేసింది ఎవరు? ఆమెకు ఏమి సమాధానం చెప్పాలి? వ్యవస్థ మనకు అనుకూలంగా ఉందని చెప్పాలా? మన పోరాటం ఈ వ్యవస్థతోనే అని చెప్పాలా? లేద.. ఈ వ్యవస్థ మనకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పాలా?
అభద్రతాభావం ఎక్కడి నుండి వస్తుందో ఇప్పుడు నాకు అర్థమైంది. నా తమ్ముళ్లు, చెల్లెళ్లు ఇండియాలో చదవలేమని చెబుతున్నారు. మేము ఈ దేశంలో ఉన్నందుకు గర్వపడుతున్నామని నేను ఎలా గర్వంగా చెప్పగలను? ఈ రోజు నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ఒకవేళ దేశ సరిహద్దులు, ఆంక్షలు లేకపోయి ఉంటే నేను ఈ దేశం బయట చదివేందుకు వెళ్లడం జరిగేది. ఎందుకంటే మన వ్యfవ్థలో నియమాలు కేవలం కాగితాల మీద మాత్రమే కఠినంగా ఉంటాయి. ఆచరణలో ప్రతిసారీ మా నమ్మకాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇప్పుడు నేను కూడా ఒకటి నిర్ణయంచుకున్నాను. నీట్ ఎగ్జాంకి కష్టపడి చదివేవారికంటే లీక్ అయిన పేపర్ల ద్వారా విజయం సాధించేవారు ఉన్న చోట నేను ఉండలేను. కష్టానికి మాత్రమే విలువ ఇచ్చే ఆ ప్రపంచంలోకే వెళ్తాను.. ఇట్లు ఎంతో అసంతృప్తి చెందిన మీ పరీక్షార్ధి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.