
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వేడుకలకు నేతృత్వం వహించనున్నారు. ఈసారి వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల వారసత్వాన్ని ప్రత్యేకంగా స్మరించుకోనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో తొలిసారి వందేమాతరం ఆలపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ ఏడాది వేడుకలకు వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువశక్తి పాత్రను ప్రధానంగా ప్రదర్శించనున్నారు. యువత శక్తి, ఆకాంక్షలు, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించారు. ఎర్రకోటకు చేరుకున్న ప్రధానమంత్రికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్వాగతం పలుకుతారు. అనంతరం సంయుక్త సైనిక, ఢిల్లీ పోలీస్ గార్డు నుంచి ప్రధానమంత్రికి సాధారణ వందనం సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రధాని గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.
తదుపరి ఎర్రకోట ప్రాకారాల వద్దకు చేరుకున్న ప్రధాని జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ సమయంలో 1721 ఫీల్డ్ బ్యాటరీకి చెందిన గన్నర్లు స్వదేశీ 105 మిల్లీమీటర్ లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 గన్ సెల్యూట్ సమర్పిస్తారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమానికి ఏకకాలంలో ఈ గన్ సెల్యూట్ నిర్వహించనున్నారు. త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం ఆర్మీ బ్యాండ్ వందేమాతరం ఆలపించనుంది. ఆ తర్వాత జాతీయ గీతం వినిపించనుంది. ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసిన వెంటనే భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు వేడుకల ప్రాంగణంపై పుష్పవర్షం కురిపించనున్నాయి. ఒక హెలికాప్టర్ జాతీయ జెండాను, మరొకటి ‘వందేమాతరం’ చిహ్నం ఉన్న జెండాను ప్రదర్శించనుంది.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం ముగిసిన తర్వాత NCC క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు ‘వందేమాతరం’, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. మొత్తం 2,500 మంది బాలురు, బాలికలైన NCC క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు ఇందులో పాల్గొంటారు. అలాగే వివిధ రంగాలకు చెందిన సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఈ ఏడాది ఎర్రకోట వేడుకలకు ఆహ్వానించారు. జ్ఞానపథ్‌లో కూర్చునే క్యాడెట్లు, వాలంటీర్లు ‘వందే మాతరం’ ఆకారాన్ని రూపొందించనుండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.