Maharashtra: ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో 75 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు.. కోటీశ్వరులు ఎందరంటే..?

Maharashtra Cabinet: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మూడ్రోజుల క్రితం తన మంత్రివర్గాన్ని విస్తరించడం తెలిసిందే. షిండే కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారిలో 75 శాతం మంది మంత్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

Maharashtra: ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో 75 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు.. కోటీశ్వరులు ఎందరంటే..?
Maharashtra CM Eknath Shinde (File Photo)
Follow us

|

Updated on: Aug 12, 2022 | 3:06 PM

Maharashtra Cabinet: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) మూడ్రోజుల క్రితం తన మంత్రివర్గాన్ని విస్తరించడం తెలిసిందే. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారిలో 75 శాతం మంది మంత్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా వారు తమ ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించారు. మంత్రులపై క్రిమినల్ కేసులకు సంబంధించిన నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADR) విడుదల చేసింది. ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో అత్యధికులు నేరచరితులు కావడం ఈ నివేదికతో తేటతెల్లమవుతోంది. శివసేనకు చెందిన ఏక్‌నాథ్ వర్గం తిరుగుబాటుతో ఉద్దవ్ థాకరే సర్కారు కూలిపోయింది. దీంతో ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా.. దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎం‌గా జూన్ 30న ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి కేబినెట్ విస్తరణ వాయిదాపడుతూ వచ్చింది. 41 రోజుల అనంతరం ఆగస్టు 9న 18 మందితో మంత్రివర్గా విస్తరించారు. దీంతో మహారాష్ట్ర కేబినెట్‌లోని మొత్తం సభ్యుల సంఖ్య సీఎంతో సహా 20 మందికి చేరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో మంత్రులు సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్ వడపోతపట్టింది. ఈ పరిశీలనలో కేబినెట్‌లోని 20 మందిలో 15 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. వీరిలో 13 మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు ఉన్నాయి. స్వయంగా వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన తమ అఫిడవిట్లలో ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా మహారాష్ట్ర కేబినెట్‌లోని అందరూ కోటీశ్వరులే. మంత్రుల సరాసరి ఆస్తుల విలువ రూ.47.45 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. మంగల్ ప్రభాత్ లోధా రూ.441.65 కోట్ల ఆస్తి విలువతో షిండే కేబినెట్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రూ.2.92 కోట్ల ఆస్తులతో మంత్రి భుపరె సందీపన్‌రావు ఆసారం కేబినెట్‌లో అతి తక్కువ ఆస్తులు కలిగిన మంత్రిగా నిలిచారు. షిండే కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కలేదు.

షిండే క్యాబినెట్‌లో 8 మంది (40 శాతం) విద్యార్హతలు పదో తరగతి నుంచి 12 వ తరగతి లోపు ఉన్నట్లు వెల్లడించారు. 11 మంది మంత్రులు (55 శాతం) గ్యాడ్యుయేషన్ లేదా దానికి మించిన విద్యార్హత కలిగి ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఒక మంత్రి డిప్లమా చేసినట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..