
చలికాలం ప్రారంభమైందంటే చాలు.. వేడి వేడి ఆహార పదార్థాలపై చాలామందికి ఆసక్తి పెరుగుతుంది. ఉదయాన్నే వేడివేడి టీ, కాఫీతో పాటు పకోడాలు, పరాటాలు, హల్వా, స్వీట్లు తినాలనే కోరిక కలుగుతుంది. వేసవితో పోలిస్తే శీతాకాలంలో ఎక్కువగా ఆకలి వేయడం, తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఏదైనా తినాలనిపించడం చాలామందిలో కనిపించే సాధారణ మార్పు. అయితే చలికాలంలో నిజంగానే శరీరానికి ఎక్కువ ఆహారం అవసరమా? ఆకలి పెరగడానికి కారణాలేంటి? ఈ కాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.
చలికాలంలో ఆకలి ఎందుకు పెరుగుతుంది?
శీతాకాలంలో ఆకలి పెరగడానికి కేవలం చలి మాత్రమే కారణం కాదు. శరీరంలోని హార్మోన్ల మార్పులు, నిద్ర వేళల్లో మార్పులు, సూర్యరశ్మి తగ్గడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆకలిని నియంత్రించే గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. గ్రెలిన్ హార్మోన్ మెదడుకు ఆకలిగా ఉన్నట్లు సంకేతాలు పంపుతుంది. లెప్టిన్ హార్మోన్ కడుపు నిండినట్లు తెలియజేసి ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్ర సరిగా లేకపోవడం, రోజువారీ దినచర్యలో మార్పులు రావడం వల్ల ఈ హార్మోన్ల పనితీరు ప్రభావితమవుతుంది. దీంతో కొంతమందికి తరచుగా ఆకలి వేయడం, తిన్నా కడుపు నిండిన భావన కలగకపోవడం జరుగుతుంది.
సూర్యరశ్మి తగ్గితే ఆహారపు అలవాట్లలో మార్పులేనా?
చలికాలంలో పగటి సమయం తగ్గుతుంది. సూర్యరశ్మి కూడా తక్కువగా లభిస్తుంది. దీనివల్ల శరీరంలోని అంతర్గత జీవ గడియారం (సర్కాడియన్ రిథమ్) ప్రభావితమవుతుంది. ఈ వ్యవస్థ నిద్ర, మేల్కొనే సమయాలను నియంత్రించడంతో పాటు శరీరంలోని పలు జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కాంతి ప్రభావంతో సెరోటోనిన్, మెలటోనిన్ వంటి రసాయనాల పనితీరులో మార్పులు రావచ్చు. ఇవి మానసిక స్థితి, నిద్రపై ప్రభావం చూపుతాయి. కొంతమందిలో ఈ మార్పుల కారణంగా తీపి పదార్థాలు, అన్నం, బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లు, అధిక కేలరీలు కలిగిన ఆహారాలపై ఆసక్తి పెరుగుతుంది.
వేడి వేడి ఆహారాలపై ఎందుకంత ఇష్టం?
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలనే సహజమైన కోరికతో చాలామంది వేడిగా ఉండే, కడుపు నింపే ఆహారాలను ఎక్కువగా ఇష్టపడతారు. బంగాళదుంప పరాటాలు, పకోరాలు, హల్వా, నువ్వుల లడ్డూలు, వేడి పానీయాలు ఈ జాబితాలో ముందుంటాయి. అయితే ఈ ఆహారాల్లో కొన్ని అధిక కొవ్వు, చక్కెర, కేలరీలను కలిగి ఉంటాయి. వీటిని తరచుగా, ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే శరీరంలో అదనపు కేలరీలు చేరుతాయి. పండుగలు, కుటుంబ వేడుకలు, బయట భోజనాలు కూడా ఈ సమయంలో పెరగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
వ్యాయామం తగ్గితే బరువు పెరగడం ఖాయం!
శీతాకాలంలో ఉదయాన్నే నిద్రలేవడం, వాకింగ్‌కు వెళ్లడం చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. చలి కారణంగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం, శారీరక శ్రమ తగ్గించడం సాధారణంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం ఎక్కువగా తీసుకుంటూ, వ్యాయామం తగ్గిస్తే శరీరంలో అదనపు కేలరీలు కొవ్వు రూపంలో నిల్వ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అలవాటు కొనసాగితే క్రమంగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా మధుమేహం, హైపోథైరాయిడిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు ఉన్నవారు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, బరువులో వచ్చే మార్పులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో ఆకలి, బరువును నియంత్రించుకోవాలంటే ఇవి పాటించండి!
చలికాలంలో ఇష్టమైన ఆహార పదార్థాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సరైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవనశైలితో బరువును నియంత్రించుకోవచ్చు.
చిన్న మార్పులతో ఆరోగ్యంగా ఉండొచ్చు!
మొత్తంగా చూస్తే.. శీతాకాలంలో ఆకలి పెరగడం వెనుక హార్మోన్లు, సూర్యరశ్మి తగ్గడం, నిద్రలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాలు ఉంటాయి. అయితే చలి కారణంగా ప్రతి ఒక్కరికీ ఎక్కువ కేలరీలు అవసరమవుతాయని భావించడం సరైంది కాదు. శరీర అవసరాలకు అనుగుణంగా సమతుల్య ఆహారం తీసుకుంటూ, వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యత ఇస్తే బరువు పెరగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆకలిలో లేదా బరువులో అసాధారణ మార్పులు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
గుర్తుంచుకోండి.. చలికాలంలో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించండి.. కానీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి!
గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయం మేరకే మీకు అందించడం జరుగుతుంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ లేదా వ్యాయామం చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..