మరికొన్ని గంటల్లో 2025వ సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం. కొత్త సంవత్సరం కొత్త ప్రారంభాలు, కొత్త అనుభవాలకు శ్రీకారం చుట్టడానికి ఇష్టపడతారు. న్యూ ఇయర్ రోజున ప్రతి ఒక్కరూ కొత్తదాన్ని ప్రయత్నించాలని కోరుకుంటారు. బిజీ లైఫ్ నుంచి కొంత సమయం వేరే ప్రదేశంలో గడపాలని కోరుకుంటారు. బిజీ లైఫ్ నుంచి విరామం తీసుకుని అందమైన ప్రదేశాలకు వెళ్లడం వల్ల రిలాక్సేషన్ ఇవ్వడమే కాదు జీవితంలో సరికొత్త ఎనర్జీ నింపుతుంది.
అందమైన దృశ్యాలకు ప్రదేశాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నగరాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ప్రకృతికి దగ్గరగా ఉండే ఎన్నో ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పర్వతాలను ఇష్టపడేవారు, సముద్రపు అలలను ఆస్వాదించాలనుకునేవారు లేదా ఎడారిని సందర్శించాలనుకునే వారికి భారతదేశంలోని అనేక ప్రాంతాలు మంచి అనుభవాలను అందిస్తాయి.
2025లో ట్రావెల్ డైరీని గుర్తుండిపోయేలా చేయాలనుకునేవారికి భారతదేశంలోని మంచి ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలను మీ సందర్శన జాబితాలో చేర్చుకోండి. ఈ ప్రదేశాలు అందంగా ఉండటమే కాదు.. ఇక్కడ ప్రకృతి, చరిత్ర, సంస్కృతి ఏకైక సంగమాన్ని చూడవచ్చు.
లడఖ్‌కు రోడ్ ట్రిప్: లడఖ్‌ను ఒకసారి సందర్శించడం ప్రతి ఒక్కరి జాబితాలో చేర్చుకోవచ్చు. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. లడఖ్‌లోని ఎత్తైన కొండలు, నీలిరంగు సరస్సులు, బౌద్ధ మత సంస్కృతి ప్రతి ప్రయాణికుడిని ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశం శాంతి, సాహసాల సంపూర్ణ కలయిక. పాంగోంగ్ సరస్సు శాంతి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రహదారి, ఖర్దుంగ్ లా పాస్‌ను ఆస్వాదించవచ్చు. షాపింగ్ కోసం లేహ్ మార్కెట్‌ని సందర్శించవచ్చు. లడఖ్‌కు వెళితే టిబెటన్ మోమోస్, తుక్పాని రుచి చూడటం మర్చిపోవద్దు.
వాయనాడ్ పచ్చదనం: కేరళలోని వాయనాడ్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పచ్చదనం, సరస్సులు, కొండల అందమైన కలయిక ఉంది. ఈ ప్రదేశం మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. చెంబ్రా శిఖరం, హార్ట్ షేప్ సరస్సు, వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఎడక్కల్ గుహలు వంటివి సదర్శించడం మంచి జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఇక్కడ మసాలా తోటలను సందర్శించండి. కేరళ సంప్రదాయ ఆహారాన్ని ఆస్వాదించండి.
మేఘాలయ మేఘాలను ఆస్వాదించండి: తూర్పు భారతదేశంలోని ఈ రాష్ట్రం దాని పచ్చదనం, జలపాతాలు, జీవన మూలాల వంతెనలకు బాగా ప్రసిద్ధి చెందింది. దీనిని “మేఘాల ఇల్లు” అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూడదగ్గ ప్రదేశం చిరపుంజి. ఇది వర్షాలకు, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి. ఇక్కడ మావ్లిన్నాంగ్ చూడదగ్గది. ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఇది గుర్తింపు పొందింది. మేఘాలయకు వెళితే.. దాకీ నదిని ఖచ్చితంగా చూడండి. ఈ సరస్సులోని నీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పడవలు గాలిలో తేలియాడుతున్నట్లు అనిపిస్తాయి.
జైసల్మేర్ రాజభవనాలు: “గోల్డెన్ సిటీ”గా పిలువబడే జైసల్మేర్ ఇసుక తిన్నెలు, కోటలు, భవనాలకు ప్రసిద్ధి చెందింది. జైసల్మేర్ కోటతో పాటు నగరం అందమైన దృశ్యం ఆ కోట నుంచి కనిపిస్తుంది. సామ్ సాండ్ డ్యూన్స్ తో పాటు ఒంటె సఫారీ, క్యాంపింగ్‌లను ఆస్వాదించవచ్చు. పట్వా కీ హవేలీ, ఇది రాజస్థానీ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ. గట్టే కి సబ్జీ , దాల్ బాటి చుర్మా చాలా ప్రసిద్ధి చెందిన రాజస్థానీ ఆహారం భిన్నమైన రుచిని ఇస్తాయి.
అండమాన్‌లోని సముద్ర దృశ్యం: సముద్రాన్ని .. సముద్ర తీరాన్ని ఇష్టపడితే.. అండమాన్ బెస్ట్ ఎంపిక. ఇక్కడ స్పష్టమైన నీలిరంగు నీరు, తెల్లని ఇసుక బీచ్‌లు మిమ్మల్ని స్వర్గంలో ఉన్న ఫీలింగ్ ను ఇస్తాయి. ఇక్కడ ఉన్న హేవ్‌లాక్ ద్వీపంలో స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ మంచి అనుభూతిని ఇస్తాయి. ఇక్కడ రాధానగర్ బీచ్ చూడటం మర్చిపోవద్దు. ఆసియాలోని అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి. అండమాన్, నికోబార్‌లోని సెల్యులార్ జెల్ (బ్లాక్ వాటర్) అందమైన జ్ఞాపకంగా మారుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..