
ఉదయం కళ్లు తెరవగానే వేడి వేడి బెడ్ టీ లేదా స్ట్రాంగ్ కాఫీ పడాల్సిందే. కొందరికైతే ఇవి లేకపోతే అసలు రోజే ప్రారంభం అవ్వదు. ఆఫీసులో అలసట వచ్చినా, ఫ్రెండ్స్‌తో ముచ్చటించినా ఈ రెండూ మన జీవితంలో భాగమైపోయాయి. అయితే టీ, కాఫీ కేవలం మనకు తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు.. మన శరీరానికి ఆధారమైన ఎముకల ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..? ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో టీ, కాఫీలకు సంబంధించి ఎముకలపై వాటి ప్రభావం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 65 ఏళ్లు పైబడిన సుమారు 10,000 మంది మహిళలపై ఒక సుదీర్ఘ సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలను ప్రముఖ న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధన ప్రకారం.. క్రమం తప్పకుండా కాఫీ తాగే వారి కంటే, రోజూ పరిమితంగా టీ తాగే వారిలో తుంటి ఎముకల ఖనిజ సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. టీలో ఉండే కాటెచిన్స్ అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు ఎముకల నిర్మాణానికి అవసరమైన కణాలను ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల వయసు పెరిగినా ఎముకలు గుల్లబారకుండా బలంగా ఉంటాయి.
కాఫీని రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగితే పెద్దగా నష్టం లేదు. కానీ రోజుకు 5 కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగే అలవాటు ఉంటే మాత్రం ముప్పేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
కాల్షియం లీకేజీ: కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని కాల్షియం శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మనం తిన్న ఆహారంలోని కాల్షియం ఎముకలకు పట్టకుండా, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది.
ఆస్టియోపోరోసిస్: దీనివల్ల ఎముకల సాంద్రత క్రమంగా తగ్గి ఆస్టియోపోరోసిస్ వ్యాధికి దారితీస్తుంది. ఫలితంగా చిన్న దెబ్బ తగిలినా లేదా కింద పడినా ఎముకలు సులభంగా విరిగిపోతాయి.
కేవలం కాఫీ మాత్రమే కాదు, మీ దైనందిన జీవితంలో ఈ క్రింది అలవాట్లు ఉంటే ఎముకలు త్వరగా బలహీనపడతాయి.
ధూమపానం, మద్యం: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, అతిగా మద్యం సేవించడం వల్ల ఎముకల్లోని కణాలు బలహీనపడతాయి.
కదలిక లేని జీవితం: శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది.
వంశపారంపర్యం: కుటుంబంలో ఎవరికైనా ఎముకల బలహీనత సమస్యలు ఉంటే జాగ్రత్త పడాలి.
టీ అయినా, కాఫీ అయినా మితంగా తీసుకుంటేనే అమృతం.. అమితంగా తీసుకుంటే నష్టం. అయితే మీ ఎముకలు పదికాలాల పాటు పటిష్టంగా ఉండాలనుకుంటే మాత్రం కాఫీ కంటే టీ కి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.