
తాయ్ చి వాకింగ్ అనేది శరీరాన్ని నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కదిలించే ఒక వ్యాయామ పద్ధతి. చైనా సంస్కృతిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళను భారతదేశంలోని యోగాతో పోల్చవచ్చు. ఇది సమతుల్యత, శరీర భంగిమ, సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ చేసే వర్కౌట్. కీళ్లపై అధిక భారం వేయకుండా నియంత్రిత పద్ధతిలో శరీర బరువును మారుస్తూ సాగే ఈ నడక, మనస్సు-శరీర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.
వయసు పెరిగే కొద్దీ వచ్చే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి సమస్యలతో బాధపడే వారికి ఈ వాకింగ్ ఒక వరం అని చెప్పొచ్చు. ఇది కాళ్లపై ఒత్తిడిని చాలా తగ్గిస్తుంది. ఒక కాలుపై శరీరం బరువును మోపుతూ, మరొక కాలును నెమ్మదిగా కదిలించడం ద్వారా శరీర స్థిరత్వం పెరుగుతుంది. దీనివల్ల పడిపోయే ప్రమాదం తగ్గుతుంది. నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి, గాయాల నుంచి కోలుకుంటున్న వారికి ఇది మెరుగైన ఫలితాలను ఇస్తుంది. అథ్లెట్లు కూడా గాయాల బారి నుంచి తప్పించుకోవడానికి దీనిని ఒక వ్యాయామంగా ఎంచుకుంటారు.
చాలామంది దీనిని బరువు తగ్గడానికి ఒక మ్యాజిక్ షార్ట్‌కట్‌గా భావిస్తుంటారు, కానీ అది వాస్తవం కాదు. కేవలం ఏడు నిమిషాల తాయ్ చి వాకింగ్‌తో పొట్టలోని కొవ్వు అద్భుతంగా కరిగిపోతుందని ఆశించడం పొరపాటు. పరుగు లేదా కార్డియో వ్యాయామాల మాదిరిగా ఇది అధిక కేలరీలను దహించే వ్యాయామం కాదు. బరువు తగ్గాలనుకునే వారు సరైన కార్డియో వర్కౌట్స్, కోర్ స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు, ప్రోటీన్ అధికంగా ఉండే సమతుల్య ఆహారంతో కూడిన జీవనశైలిని పాటించాలి. తాయ్ చి ఒక ఫిట్‌నెస్ సాధన మాత్రమే కానీ, బరువు తగ్గడానికి కేవలం ఇది సరిపోదు.
ముఖ్యంగా, ఈ వ్యాయామాన్ని సరైన మార్గదర్శకత్వంలోనే నేర్చుకోవాలి. ఇప్పటికే తీవ్రమైన వెన్నుముక సమస్యలు లేదా కీళ్లవాతం ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సరైన పద్ధతిలో కాకపోతే కీళ్ల అమరికలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోకుండా, ఆరోగ్యం కోసం ఒక క్రమశిక్షణతో కూడిన పద్ధతిని ఎంచుకోండి.