
బీరకాయ సాధారణంగా అందరి ఇళ్లలో చేసుకునే కూరగాయే అయినా, దీనిలోని విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలియవు. బీరకాయలో ఫైబర్, విటమిన్ సీ, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మెగ్నీషియం, పొటాషియం, నీటి శాతం సమృద్ధిగా ఉంటాయి. బీరకాయలో ఫైబర్, నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇది సమర్థవంతంగా అరికడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.
బీరకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు దీనిని ధైర్యంగా తినవచ్చు. ఇది సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేసి కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే, ఇందులో ఉన్న యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు, నీటి శాతం కిడ్నీల వడబోత ప్రక్రియను మెరుగుపరిచి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీరకాయలో కేలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి ఆకలి తగ్గుతుంది. ఇది క్రొవ్వు పేరుకుపోకుండా చేసి బరువును అదుపులో ఉంచుతుంది.
ఇందులోని మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటు, పెరగకుండా నివారించి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది. బీరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. కీళ్ల వాపులు, మంటలతో బాధపడేవారికి కూడా ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే ఈ రోజు నుండే బీరకాయను మీ రోజువారీ డైట్‌లో భాగం చేసుకోండి!
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..