
ఉదయం పూట ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే అల్పాహారం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. చలికాలంలో చాలామంది పరాఠాలు, ఉప్మా వంటివి ఇష్టపడతారు. అయితే వాటికి భిన్నంగా, తక్కువ సమయంలో తయారయ్యే మఖానా దోసెను అల్పాహారంగా చేసుకోవచ్చు. దీని కోసం పిండిని గంటల తరబడి పులియబెట్టాల్సిన పని కూడా ఉండదు. మఖానాలో కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, మొక్కల ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును అదుపులో ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి. మఖానా దోస కోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
మఖానాలో కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు ప్లాంట్ ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి, బరువును నియంత్రణలో ఉంచడానికి, ఎక్కువ సమయం ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంచడానికి తోడ్పడతాయి.
మఖానా: 1 కప్పు
సూజీ (బొంబాయి రవ్వ): 1/2 కప్పు
పెరుగు: 1/4 కప్పు
పచ్చిమిర్చి: 1 (సన్నగా తరిగినది)
అల్లం: 1 చిన్న ముక్క (తురిమినది)
జీలకర్ర: 1/2 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: అవసరానికి తగినంత
దేశీ నెయ్యి లేదా నూనె: దోసె కాల్చడానికి
కడాయిలో నెయ్యి లేదా నూనె లేకుండా మఖానాలను తక్కువ మంటపై 3 నుంచి 4 నిమిషాలు కరకరలాడే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా రుబ్బుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో మఖానా పొడి, సూజీ, పెరుగు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీరు కలుపుతూ దోసె పిండి మాదిరిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఈ పిండిపై మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు పక్కన ఉంచాలి. దీనివల్ల సూజీ నీటిని పీల్చుకుని పిండి చక్కగా సెట్ అవుతుంది. మరీ చిక్కగా అనిపిస్తే 1 లేదా 2 చెంచాల నీరు కలుపుకోవచ్చు. నాన్‌స్టిక్ పెనాన్ని మధ్యస్థ మంటపై వేడి చేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి లేదా గుడ్డతో తుడిచి కొన్ని చుక్కల నెయ్యి లేదా నూనె వేయాలి. గరిటెతో పిండి తీసుకుని గుండ్రంగా పలుచగా పరచాలి. అంచుల వెంట కొంచెం నెయ్యి వేసి బంగారు రంగులోకి వచ్చి కరకరలాడే వరకు కాల్చుకుని, మడిచి వేడివేడిగా వడ్డించాలి.