కుండీలో మల్లె మొక్కలు పెంచుతున్నారా..? ఈ చిన్న పని చేస్తే, పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయ్..

కుండీల్లో మల్లె మొక్కలను పెంచుతున్నారా? ఏడాది పొడవునా ఎక్కువగా పూలు పూయాలంటే సరైన సూర్యరశ్మి, నీరు, ప్రూనింగ్‌తో పాటు సమర్థవంతమైన ఎరువులు అందించడం చాలా ముఖ్యం. అరటి తొక్కల పొడి, గుడ్డు పెంకుల పొడి, ఆవపిండితో ఇంట్లోనే తయారు చేసుకునే ఎరువును ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

కుండీలో మల్లె మొక్కలు పెంచుతున్నారా..? ఈ చిన్న పని చేస్తే, పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయ్..
Jasmine Plant Care

Updated on: Aug 26, 2026 | 4:28 PM

ప్రతి ఒక్కరి ఇంట్లో మల్లెపూల మొక్క ఉంటుంది. ఊర్లల్లో అయితే.. ఇంటి ఆవరణలో, పెరట్లో పెంచుకుంటారు. ఇవి ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి.. అయితే.. ఇంటి ఆవరణలో ప్లేస్ లేని వారు.. కుండీలలో మల్లె మొక్కలను పెంచుకుంటారు. ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి.. అయితే.. వర్షాకాలం అయినా.. శీతాకాలం అయినా.. ఎండాకాలం అయినా.. ఏ సీజన్ అయినా.. చిన్న కుండీలలో కూడా మల్లె పువ్వులు విపరీతంగా పూయాలంటే సరైన సంరక్షణ, సమర్థవంతమైన ఎరువులు అందించడం చాలా అవశ్యకం. నేలపై పెంచే అవకాశం లేనివారు కుండీలలో మల్లె మొక్కలను పెంచినప్పుడు, వాటికి తగిన పోషకాలు, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

మల్లె మొక్కల సంరక్షణకు ముఖ్యమైన చిట్కాలు:

ఆకుల తొలగింపు: మొక్క అడుగున ఉన్న పెద్ద, పాత ఆకులను ఎప్పటికప్పుడు తీసివేయడం వల్ల పువ్వుల సైజు పెద్దగా వస్తుంది. మొగ్గలు ఎక్కువగా వస్తాయి.

ఎండిన కొమ్మలు, ఆకులు, వాడిన పువ్వులు తొలగింపు: ఎండిపోయిన కొమ్మలు, ఆకులు లేదా వాడిపోయిన పువ్వులను వెంటనే తొలగించాలి. ఇది మొక్క శక్తిని వృథా చేయకుండా, కొత్త పూలు రావడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

సూర్యరశ్మి: మల్లె మొక్కలకు పూర్తి సూర్యరశ్మి అవసరం. రోజుకు కనీసం 6-8 గంటల ఎండ తగలాలి. నీడలో పెడితే పూలు రావు, వచ్చినా చిన్నవిగా ఉంటాయి. టెర్రస్ గార్డెన్‌లో పెంచడానికి ప్రయత్నించండి.

కలుపు మొక్కల నివారణ: కుండీలలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అవి మొక్కకు అందించే పోషకాలను గ్రహించి, మొక్కకు బలం చేరకుండా చేస్తాయి.

నీటిపారుదల: మల్లె మొక్కలకు నీరు ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా చూసుకోవాలి. మట్టి పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే నీరు పోయాలి. అధిక నీరు ఆకుల పెరుగుదలకు దారితీసి, పూలు తక్కువగా వచ్చేలా చేస్తుంది. మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి కానీ బురద బురదగా ఉండకూడదు.

మట్టి మిశ్రమం: కొత్త మొక్కలు నాటడానికి లేదా రీపోటింగ్ చేయడానికి తేలికపాటి మట్టి మిశ్రమం వాడాలి. ఇసుక, మట్టి, కోకోపీట్, వేప పిండి, వర్మీకంపోస్ట్ లేదా పశువుల ఎరువు కలిపి తయారుచేసుకున్న మిశ్రమం వేర్లు త్వరగా విస్తరించడానికి సహాయపడుతుంది. ఇది మొక్కను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ప్రూనింగ్: మల్లె మొక్కలకు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయడం అవసరం. ఇది కాండం బలంగా మారడానికి, కొమ్మలు లావుగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రూనింగ్ చేయకపోతే కొమ్మలు సన్నగా ఉండిపోయి ఎండిపోయే అవకాశం ఉంటుంది.

మట్టి గుల్ల చేయడం: వారానికి ఒకసారి మట్టిని గుల్ల చేయడం వల్ల గాలి, వెలుతురు లోపలికి చేరి వేర్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది ఫంగస్ రాకుండా నిరోధిస్తుంది.

ఇంట్లో తయారుచేసిన ఎరువు:

మల్లె మొక్కలకు సమృద్ధిగా పూలు పూయడానికి ఒక అద్భుతమైన ఇంట్లో తయారుచేసిన “ఆల్ మిక్స్” ఎరువు ఉంది. దీనికి కావలసినవి:

అరటిపండు తొక్కల పొడి: అరటిపండు తొక్కలను బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఇది పొటాషియంను అందించి, పూల సైజును పెంచి, మొగ్గలు ఎక్కువగా రావడానికి సహాయపడుతుంది. ఒక టీస్పూన్ తీసుకోవాలి.

గుడ్డు పెంకుల పొడి: ఉడకబెట్టని గుడ్ల పెంకులను ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఇది కాల్షియంను అందిస్తుంది. ఒక టీస్పూన్ తీసుకోవాలి.

ఆవపిండి: ఆవాలను పొడి చేసి, దానిని ఒక న్యూస్‌పేపర్‌లో 15-20 రోజుల పాటు కట్టి ఉంచాలి. ఇది ఆవాలలో ఉండే వేడిని తగ్గిస్తుంది. ఆ తర్వాత ఉపయోగించాలి. ఆవపిండి మొక్కల పెరుగుదలకు చాలా మంచిది. ఒక టీస్పూన్ తీసుకోవాలి.

ఈ మూడు పొడులను కలిపి మిశ్రమం చేసుకోవాలి.

ఎరువును ఎలా ఇవ్వాలి:

ముందుగా, కుండీలోని మట్టిని 1 అంగుళం లోతు వరకు కొద్దిగా గుల్ల చేయాలి.

చిన్న కుండీ అయితే 1 టీస్పూన్, పెద్ద కుండీ అయితే 2 టీస్పూన్ల ఎరువును మొక్క మొదలుకు దూరంగా, కుండీ అంచు చుట్టూ సమానంగా చల్లాలి.

ఎరువును మట్టితో కప్పివేయాలి.

సాయంత్రం 5 గంటల తర్వాత నీరు పోయాలి. ఎరువును కూడా సాయంత్రం పూటే ఇవ్వడం ఉత్తమం.

రీపోటింగ్ చిట్కాలు:

ఎండాకాలంలో రీపోటింగ్ (మొక్కలను పాత కుండీ నుండి వేరే పెద్ద కుండీలోకి లేదా కొత్త మట్టిలోకి మార్చడం) చేయాలనుకుంటే, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే చేయాలి. రీపోటింగ్ చేసిన తర్వాత మొక్కను కనీసం వారం రోజుల పాటు పాక్షిక నీడ (సెమీ షేడ్)లో ఉంచాలి. కొత్త చిగుర్లు వచ్చిన తర్వాతే పూర్తి సూర్యరశ్మికి మార్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, పైన చెప్పిన ఎరువును క్రమం తప్పకుండా అందిస్తే, మీ మల్లె మొక్కలు ఏడాది పొడవునా సువాసనభరితమైన పూలతో నిండిపోతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us