వైవాహిక బంధంలో గందరగోళమా? మానసిక వేధింపులను గుర్తించడం ఎలా

వైవాహిక బంధంలో ప్రేమ, నమ్మకం ఎంత ముఖ్యమో.. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించడం కూడా అంతే అవసరం. అయితే, కొన్నిసార్లు భాగస్వామి ప్రవర్తన మనల్ని మానసిక గందరగోళానికి గురిచేయవచ్చు. దీనినే గ్యాస్‌లైటింగ్ అంటారు. వైవాహిక బంధంలో భాగస్వామి మాటలతో మిమ్మల్ని మీరు అనుమానించుకునేలా చేయడం ఒక రకమైన మానసిక మోసం. దీనిని గుర్తించి సకాలంలో స్పందించడం మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

వైవాహిక బంధంలో గందరగోళమా? మానసిక వేధింపులను గుర్తించడం ఎలా
Gas Lighting

Updated on: May 07, 2026 | 6:05 AM

మనుషుల స్వభావాలు భిన్నం. ముఖ్యంగా వైవాహిక బంధంలో మహిళలు భర్త ప్రేమ, గుర్తింపు కోసం తాపత్రయపడటం సహజం. అయితే ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుని కొంతమంది పురుషులు తమ భాగస్వాములను ‘గ్యాస్‌లైటింగ్’ అనే మానసిక ఊబిలోకి నెట్టేస్తుంటారు. అసలు ఈ గ్యాస్‌లైటింగ్ అంటే ఏమిటి? ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది? బాధితులు ఎదుర్కొనే పరిస్థితుల గురించి తెలుసుకుందాం.

గ్యాస్‌లైటింగ్ అంటే ఏమిటి?

గ్యాస్‌లైటింగ్ అనేది ఒక రకమైన మానసిక మోసం. ఇందులో ఒక వ్యక్తి తన భాగస్వామి యొక్క ఆలోచనలను, జ్ఞాపకాలను లేదా వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తూ, వారిని మానసిక క్షోభకు గురిచేస్తారు. ఇది నేరుగా శారీరక దాడి కాకపోయినా, మనిషిని లోలోపల కృంగదీసే అత్యంత ప్రమాదకరమైన ప్రవర్తన.

గ్యాస్‌లైటింగ్‌కు పాల్పడే వారి లక్షణాలు

  • భాగస్వామి చేసే చిన్న చిన్న పనులకు కూడా విపరీతంగా రియాక్ట్ అవుతూ, అర్థం లేని మాటలతో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటారు.
  • తాము చెప్పిందే వేదం అని నమ్మిస్తూ, అందరి ముందు భాగస్వామిని తప్పుగా నిరూపించడానికి ప్రయత్నిస్తారు. “నువ్వు ఏం చేసినా నన్ను దాటి వెళ్లలేవు” అనే ధీమాతో వారిని అకారణంగా దోషులుగా నిలబెట్టి పైశాచిక ఆనందం పొందుతారు.
  • పదేపదే అనుమానిస్తూ, తాము చెప్పిన విషయాలనే మర్చిపోయినట్లు నటిస్తూ ఎదుటివారి మానసిక స్థితిపై వారికే అనుమానం కలిగేలా చేస్తారు.
  • భాగస్వామి చేసేది కరెక్ట్ అయినా సరే, వారు పదే పదే క్షమాపణలు చెప్పాలని కోరుకుంటారు. తద్వారా బంధంలో తమదే పైచేయి అని నిరూపించుకోవడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడతారు.
  • భార్య కేవలం ఇంటి పనికి, శారీరక అవసరాలకు మాత్రమే గుర్తిస్తే అది కూడా గ్యాస్‌లైటింగ్‌లో భాగమే. ఇతర విషయాల్లో వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, తన గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తారు. ఒకవేళ భార్య తన తప్పును గుర్తిస్తే, అకారణంగా గొడవలు సృష్టించి మోసం చేయడానికి వెనుకాడరు.

గ్యాస్‌లైటింగ్ బారిన పడిన మహిళలు తమ జీవితంపై తాము నియంత్రణ కోల్పోతారు. ఊబిలో చిక్కుకున్నట్లుగా, ఊపిరాడని స్థితిని అనుభవిస్తారు. ఈ బంధం నుండి బయటపడలేక, లోలోపల నలిగిపోతూ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. బంధంలో మీ ఆత్మగౌరవం దెబ్బతింటున్నా, పదేపదే తప్పు మీదేనని నిరూపించబడుతున్నా మీరు గ్యాస్‌లైటింగ్‌కు గురవుతున్నారని గుర్తించాలి. అలాంటి వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకుని, మానసిక దృఢత్వంతో ఆ బంధం నుండి బయటపడటమే శ్రేయస్కరం. లేదంటే ఆ మానసిక వేధింపుల చేతిలో జీవితం బలికాక తప్పదు.

Follow Us