
భారతదేశంలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించే సీనియర్ లివింగ్ గృహాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవనం, మెరుగైన వైద్య సదుపాయాలు, భద్రత, ఆరోగ్య సంరక్షణతో పాటు స్వతంత్రంగా జీవించే అవకాశాన్ని కల్పించే నివాస సముదాయాలపై సీనియర్ సిటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో సీనియర్ లివింగ్ విభాగం కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలు ఈ రంగంలో ప్రముఖ మార్కెట్లుగా ఎదుగుతున్నాయి.
స్క్వేర్ యార్డ్స్ విడుదల చేసిన సీనియర్ లివింగ్ రిపోర్టు 2026 ప్రకారం, భారతదేశ సీనియర్ లివింగ్ మార్కెట్ 2026లో 4.31 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2031 నాటికి 11.43 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ వృద్ధిలో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్, పూణే నగరాలు కీలక మార్కెట్లుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఈ విభాగంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే నగరంగా అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌పై డెవలపర్ల ప్రత్యేక దృష్టి
సీనియర్ లివింగ్ ప్రాజెక్టులకు హైదరాబాద్ అనుకూల గమ్యస్థానంగా మారుతోంది. నగరంలో అందుబాటులో ఉన్న నివాస స్థలాలు, ఇతర ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఆస్తి ధరలు, విస్తృతమైన ఆసుపత్రుల నెట్వర్క్, మెరుగైన రవాణా సదుపాయాలు ఈ రంగానికి బలంగా మారుతున్నాయి. వృద్ధులకు అవసరమైన వైద్య సహాయం, అత్యవసర చికిత్స, రోజువారీ సేవలు అందుబాటులో ఉండే నివాస సముదాయాల నిర్మాణంపై డెవలపర్లు దృష్టి సారిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇతర నగరాలు లేదా దేశాల్లో నివసిస్తున్న వృద్ధులకు ఇటువంటి ప్రాజెక్టులు మరింత ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.
బెంగళూరు, పూణే నగరాల్లోనూ పెరుగుతున్న ఆసక్తి
బెంగళూరు ఇప్పటికే సీనియర్ లివింగ్ మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించింది. ఇక్కడి మెరుగైన వైద్య సదుపాయాలు, అభివృద్ధి చెందిన నివాస ప్రాంతాలు, ప్రత్యేక వృద్ధుల గృహ ప్రాజెక్టులు ఈ రంగానికి అనుకూలంగా ఉన్నాయి. వృద్ధుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులు అందుబాటులో ఉండటం నగరానికి కలిసొస్తోంది.
ఇక పూణేలోనూ సీనియర్ లివింగ్ విభాగం విస్తరిస్తోంది. నగరంలోని స్థిరపడిన నివాస సముదాయాలు, వృద్ధుల జనాభా, ఇప్పటికే అందుబాటులో ఉన్న సీనియర్ హౌసింగ్ ప్రాజెక్టులు ఈ మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయి.
సీనియర్ లివింగ్ అంటే ఏమిటి?
సాధారణంగా వృద్ధుల కోసం నిర్మించే ఇళ్లకు, సీనియర్ లివింగ్ ప్రాజెక్టులకు మధ్య వ్యత్యాసం ఉంది. వీటిలో కేవలం నివాస సదుపాయాలే కాకుండా అనేక ప్రత్యేక సేవలు అందిస్తారు.
– 24 గంటల భద్రత, అత్యవసర వైద్య సహాయం.
– ఆసుపత్రులు, వైద్యుల సేవలకు అనుసంధానం.
– ఫిజియోథెరపీ, ఆరోగ్య పరీక్షలు.
– ప్రత్యేక భోజన సదుపాయాలు.
– ఇంటి నిర్వహణ, హౌస్ కీపింగ్ సేవలు.
– వ్యాయామం, యోగా, వినోద కార్యక్రమాలు.
– ఇతర వృద్ధులతో సామాజిక సంబంధాలు పెంపొందించుకునే అవకాశాలు.
ఈ సదుపాయాల ద్వారా వృద్ధులు కుటుంబ సభ్యులపై పూర్తిగా ఆధారపడకుండా, తమకు నచ్చిన విధంగా స్వతంత్రంగా జీవించవచ్చు.
స్క్వేర్ యార్డ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ తనుజ్ షోరి అభిప్రాయం ప్రకారం, స్వతంత్ర జీవనం, ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ, మెరుగైన జీవన ప్రమాణాలపై సీనియర్ సిటిజన్లలో పెరుగుతున్న ఆసక్తి ఈ మార్కెట్‌ను బహుళ బిలియన్ డాలర్ల విభాగంగా మారుస్తోందని అభిప్రాయపడ్డారు.
డిమాండ్‌కు తగ్గట్టుగా లేని గృహాలు..!
కొలియర్స్ ఇండియా అంచనాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో సీనియర్ లివింగ్ గృహాల డిమాండ్ సుమారు 20-22 లక్షల యూనిట్లుగా ఉంది. అయితే వ్యవస్థీకృత రంగంలో అందుబాటులో ఉన్న గృహాలు కేవలం 25 వేల యూనిట్లే. 2030 నాటికి డిమాండ్ 28-30 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని, సరఫరా లక్ష యూనిట్లకు పెరగవచ్చని అంచనా వేస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. 2025 నుంచి డెవలపర్లు, పెట్టుబడిదారులు రూ.13,000 కోట్లకు పైగా పెట్టుబడుల నిబద్ధతలను ప్రకటించారు. రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో ఈ పెట్టుబడులు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని కొలియర్స్ తెలిపింది.
టైర్-2, టైర్-3 నగరాల వైపు విస్తరణ
సీనియర్ లివింగ్ ప్రాజెక్టులు ఇక మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. కోయంబత్తూరు, మైసూరు, వడోదర, నాసిక్, కొచ్చి, తిరుపతి, హరిద్వార్, వారణాసి, అయోధ్య వంటి నగరాలు కూడా కొత్త పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతున్నాయి. కొలియర్స్ అంచనా ప్రకారం, రాబోయే కొత్త ప్రాజెక్టుల్లో సుమారు 30-40 శాతం టైర్-2, టైర్-3 నగరాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తక్కువ జీవన వ్యయం, అందుబాటులో ఉండే భూమి, మెరుగుపడుతున్న వైద్య సదుపాయాలు ఈ నగరాలకు అనుకూలంగా మారుతున్నాయి.
భవిష్యత్తులో భారీ అవకాశాలు
భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గడం, పదవీ విరమణ తర్వాత నాణ్యమైన జీవనాన్ని కోరుకోవడం వంటి పరిణామాలు సీనియర్ లివింగ్ రంగానికి మరింత ప్రాధాన్యతను తీసుకొస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలు భారతదేశ సీనియర్ లివింగ్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న ఈ విభాగం రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలను అందిస్తోంది. అయితే ఈ రంగంలో దీర్ఘకాలిక విజయానికి సరసమైన ధరల్లో నాణ్యమైన గృహాలు, విశ్వసనీయ వైద్య సేవలు, భద్రత, పారదర్శక నిర్వహణ అత్యంత కీలకం కానున్నాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..