
సాధారణంగా గది ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ లోపు ఉంటే, గుడ్లు ఫ్రిజ్ బయట పది నుంచి పన్నెండు రోజులు తాజాగా ఉంటాయి. వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి త్వరగా పాడవుతాయి. నేరుగా సూర్యరశ్మి సోకే చోట లేదా వేడి ప్రదేశాల్లో ఉంచితే కేవలం ఒకటి రెండు రోజుల్లోనే గుడ్లు పాడైపోవచ్చు. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి. స్థిరమైన చల్లని ఉష్ణోగ్రతలు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించి గుడ్ల నాణ్యతను కాపాడతాయి. వాణిజ్యపరంగా అమ్మే గుడ్లు ఫలదీకరణం చెందనివి కావడం వల్ల, ఫలదీకరణం చెందిన గుడ్ల కంటే నాలుగు నుంచి ఐదు రోజులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
గుడ్లు తెచ్చిన వెంటనే కడిగే అలవాటు చాలామందికి ఉంటుంది, కానీ ఇది తప్పు. గుడ్డు పెంకుపై సహజ సిద్ధమైన రక్షణ పొర ఉంటుంది. ఇది బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. కడగడం వల్ల ఈ రక్షణ పొర తొలగిపోయి గుడ్డు త్వరగా పాడవుతుంది. కాబట్టి వండే ముందు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. గుడ్లను నిల్వ చేసేటప్పుడు పదునైన భాగం కిందికి, వెడల్పాటి భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల లోపల ఉండే ఎయిర్ సెల్ స్థిరంగా ఉండి, సొన మధ్యలోనే ఉంటుంది.
చాలా ఫ్రిజ్‌ల డోర్లకు గుడ్ల కోసం ప్రత్యేకమైన ట్రేలు ఉంటాయి, కానీ డోర్లను తరచూ తెరవడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి. కాబట్టి గుడ్లను ఫ్రిజ్ లోపలి అరల్లో వాటి ఒరిజినల్ కార్టన్లలోనే ఉంచడం మంచిది. ఒక గుడ్డు తాజాగా ఉందో లేదో తెలియాలంటే నీటి పరీక్ష చేయవచ్చు. ఒక పాత్రలో నీరు పోసి గుడ్డును అందులో వేయాలి. అది అడుగుకు చేరుకుని పడుకుంటే తాజాగా ఉన్నట్లు, నిటారుగా నిలబడితే పాతబడినట్లు, ఒకవేళ తేలితే అది పాడైపోయినట్లు అర్థం. ఈ చిట్కాలను పాటిస్తే గుడ్లను ఎక్కువ రోజులు తాజాగా, ఆరోగ్యకరంగా వాడుకోవచ్చు.