
వర్షాకాలంలో వంటగదిలో బొద్దింకల బెడద చాలా ఎక్కువవుతుంది. ఇవి కేవలం ఆహారాన్ని పాడు చేయడమే కాకుండా ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, అలర్జీల వంటి అనేక రోగాలను వ్యాప్తి చేస్తాయి. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ స్ప్రేలు వాడకుండా, మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టవచ్చు. వాటిలో ముఖ్యంగా బిర్యానీ ఆకు, బేకింగ్ సొడా, వేప నూనె ఉన్నాయి. వీటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.
బొద్దింకలను తరిమికొట్టే 3 అద్భుతమైన చిట్కాలు
బిర్యానీ ఆకులు: వంటలో ఉపయోగించే బిర్యానీ ఆకుల వాసన బొద్దింకలకు నచ్చదు. కాబట్టి వీటి ద్వారా మీరు ఈజీగా బొద్దింకలను వదిలించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఈ బే ఆకులను కొద్దిగా నలిపి, బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్లేస్‌లో పెట్టాలి. ఆవి ఆ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు వాటి వాసనను భరించలేక అక్కడి నుంచి పారిపోతాయి. మరోసారి అటువైపు రాకుండా ఉంటాయి.
బేకింగ్ సోడా, చక్కెర: బే ఆకులతో పాటు, వంటగదిలో లభించే బేకింగ్ సోడా కూడా వీటిని తరిమికొట్టేందుకు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే.. బేకింగ్ సొడా, చక్కెరను సమాన పరిమాణంలో కలిపి, బొద్దింకలు తరచుగా వచ్చే ప్రదేశాలలో చల్లండి. బొద్దింకలు చక్కెరను తింటాయి,అప్పుడు చక్కెరకు అంటుకున్న బేకింగ్ సోడా వాటి కడుపులోకి వెళ్లి వాయువును ఉత్పత్తి చేసి, వాటి జీర్ణవ్యవస్థను అడ్డుకుంటుంది. ఈ పొడిని నీరు లేని ప్రదేశంలో మాత్రమే చల్లేలా చూసుకోండి, ఎందుకంటే నీరు లేదా తేమ వల్ల చక్కెర, సోడా కరిగి అంటుకుపోతాయి, దీనివల్ల బొద్దింకలు దానిని తినలేవు.
వేప నూనె: వేపకు సహజ కీటకనాశక గుణాలు ఉన్నాయి. ఇది బొద్దింకలను తమిరికొట్టడంలో సూపర్‌గా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే.. ఒక స్ప్రే బాటిల్‌లో నీరు తీసుకుని, అందులో కొన్ని చుక్కల వేప నూనె కలిపి కిచెన్, తలుపుల మూలల్లో స్ప్రే చేయండి. దీనివల్ల బొద్దింకలు దూరమవ్వడమే కాకుండా ఇల్లు కూడా తాజాగా ఉంటుంది. దీనికి బదులుగా మీరు నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు.
బొద్దింకలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బొద్దింకల సమస్య శాశ్వతంగా తీరాలంటే కేవలం చిట్కాలు సరిపోవు, వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి వేళల్లో సింక్‌లో ఎంగిలి గిన్నెలను అలాగే ఉంచకుండా చూసుకోవాలి. అలాగే కిచెన్ , డైనింగ్ ఏరియాను ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి. తినే పదార్థాలను ఎప్పుడూ గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరుచుకోవాలి. ఇళ్లలోని మూలలను, గోడల పగుళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. చెత్త బుట్టను రోజూ ఖాళీ చేయాలి, ఎల్లప్పుడూ దానిపై మూత పెట్టి ఉంచాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.