
ఇల్లు క్లీనింగ్ అనేది మహిళలకు అతిపెద్ద టాస్క్. అయితే ఇల్లు శుభ్రం చేసేటప్పుడు చాలామంది కిటికీలు, నేల, ఫర్నిచర్‌పై చూపించే శ్రద్ధను తలుపులపై చూపించరు. కానీ రోజూ మురికి చేతులతో పదేపదే తాకడం, వంటగది నుండి వచ్చే నూనెలు, మసాలాల జిడ్డు, బయటి దుమ్ము వల్ల తలుపులపై.. ముఖ్యంగా హ్యాండిల్స్ చుట్టూ నల్లటి, మొండి పొర పేరుకుపోతుంది. దీనివల్ల తలుపులు చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. అయితే వీటిని మామూలు నీటితో లేదా ఘాటైన డిటర్జెంట్లతో రుద్దడం వల్ల చెక్క పెయింట్ లేదా పాలిష్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఖరీదైన క్లీనర్లు లేకుండా, గంటల తరబడి శ్రమపడకుండా ఇంట్లోనే ఉండే వస్తువులతో చెక్క, ప్లైవుడ్ లేదా ఇనుప తలుపులను సరికొత్తగా ఎలా మెరిపించవచ్చో తెలుసుకోవడం ముఖ్యం.
ఒకవేళ మీ ఇంట్లోని చెక్క తలుపులు జిడ్డుగా మారి మెరుపు కోల్పోతే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో అర కప్పు తెల్ల వెనిగర్, అర కప్పు ఆలివ్ నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోయండి. వెనిగర్ తలుపుపై ఉన్న నల్లటి మురికిని, జిగురును రుద్దాల్సిన అవసరం లేకుండానే వదులు చేస్తుంది. అదే సమయంలో ఇందులోని నూనె చెక్కకు మంచి పోషణనిచ్చి, సరికొత్త మెరుపును తెస్తుంది. దీన్ని తలుపుపై స్ప్రే చేసి, ఒక శుభ్రమైన కాటన్ గుడ్డతో తుడిస్తే సరిపోతుంది.
తలుపుల మూలల్లో, హ్యాండిల్స్ చుట్టూ, డిజైన్లు ఉన్నచోట పేరుకుపోయే నల్లటి మురికిని వదిలించడానికి ఇది బెస్ట్ రెమెడీ. కొద్దిగా బేకింగ్ సోడా, లిక్విడ్ డిష్ సబ్బు కలిపి పేస్ట్‌లా తయారుచేయండి. ఈ పేస్ట్‌ను మురికి ఎక్కువగా ఉన్న భాగాల్లో రాయండి. ఈ పేస్ట్‌ను రాసి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఒక పాత, మెత్తటి టూత్‌బ్రష్‌తో మెల్లగా రుద్దితే నల్లటి మురికి అంతా కరిగిపోయి ఊడిపోతుంది. చివరిగా ఒక తడి గుడ్డతో తుడిచేసుకుంటే తలుపు క్లీన్ అవుతుంది.
ఇంటి ప్రధాన ద్వారాలు లేదా గ్రిల్స్ ఇనుముతో చేసినవైతే, వాటికి త్వరగా తుప్పు పట్టడం లేదా నల్లటి మరకలు పడటం జరుగుతుంది. ఒక నిమ్మకాయను సగానికి కోసి, దానిపై కొద్దిగా ఉప్పు చల్లాలి. ఈ నిమ్మ చెక్కతో మరకలు లేదా తుప్పు పట్టిన చోట మెల్లగా రుద్దాలి. నిమ్మకాయలోని యాసిడ్ గుణాలు, ఉప్పులోని బరుసదనం కలిసి ఎక్కువ శ్రమ లేకుండానే ఇనుప తలుపులపై ఉన్న తుప్పును, నల్లటి మొండి మరకలను పూర్తిగా తొలగిస్తాయి.
పండగలు, శుభకార్యాలు వచ్చేటప్పుడు మార్కెట్లో దొరికే కెమికల్ క్లీనర్ల కోసం డబ్బులు వృథా చేయకుండా.. ఈ సింపుల్ స్మార్ట్ కిచెన్ హ్యాక్స్‌ని ప్రయత్నిస్తే మీ ఇంటి తలుపులు ఎప్పుడూ సరికొత్తగా మెరుస్తూనే ఉంటాయి.