
సనాతన ధర్మంలో పూజలకు, శుభకార్యాలకు పువ్వులకు విశేష ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మందార పువ్వుల కోసం చాలామంది తమ బాల్కనీలు, డాబాలు, పెరట్లో మందార మొక్కలను పెంచుతుంటారు. అయితే, వేసవి, వర్షాకాలంలో పచ్చగా కళకళలాడుతూ పూలు పూసే ఈ మొక్క.. చలికాలం రాగానే ఒక్కసారిగా వాడిపోవడం మొదలవుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, మొగ్గలు తగ్గిపోవడం, కొమ్మలు ఎండిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వెచ్చని వాతావరణంలో పెరిగే మందార మొక్కకు చలికాలం తగిన సంరక్షణ అందిస్తే మళ్లీ జీవం పోసుకోవచ్చు.
మందార మొక్క ఆరోగ్యంగా పెరిగి, మొగ్గలు వేయడానికి ఎండ చాలా ముఖ్యం. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల మొక్క పెరుగుదల మందగిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం 4 నుంచి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలేలా బాల్కనీ లేదా టెర్రస్‌పై కుండీని ఉంచాలి.
వేసవిలో మాదిరిగా చలికాలంలో మందార మొక్కకు రోజూ నీరు పోయకూడదు. చల్లని వాతావరణం వల్ల కుండీలోని మట్టి త్వరగా ఆరదు. అతిగా నీరు పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. నీరు పోసే ముందు వేలితో మట్టి పైపొరను ఒకటి లేదా రెండు అంగుళాల లోతు వరకు తాకి చూడాలి. మట్టి పూర్తిగా పొడిగా అనిపిస్తేనే నీరు పోయాలి.
శీతాకాలపు రాత్రివేళల్లో వీచే చల్లని గాలులు మందార మొక్కను దెబ్బతీస్తాయి. మొక్కను నేరుగా చలిగాలులు తగిలే ఆరుబయట కాకుండా కాస్త రక్షణగా ఉండే చోట పెట్టాలి. వీలైతే రాత్రిపూట కుండీని ఇంటి లోపల ఉంచి, మళ్లీ పగటిపూట ఎండ తగిలేలా బయటకు తీసుకురావడం వల్ల మొక్క సురక్షితంగా ఉంటుంది.
చలికాలంలో మొక్క పెరుగుదల తగ్గిందని చాలామంది రసాయన ఎరువులు వేస్తుంటారు. కానీ ఈ సమయంలో ఎక్కువ ఎరువులు వేయడం మొక్కకు హాని చేస్తుంది. అవసరమైతే కొద్ది మొత్తంలో బాగా కుళ్లిన సేంద్రియ ఎరువు లేదా వర్మీకంపోస్ట్ మాత్రమే వాడాలి. అలాగే కుండీలో మట్టి గట్టిపడకుండా, నీరు నిలిచిపోకుండా ఉండేందుకు సాధారణ మట్టిలో కోకోపీట్, వర్మీకంపోస్ట్ కలిపితే వేళ్లకు గాలి బాగా అందుతుంది.
శీతాకాలంలో ఆకులు పసుపు రంగులోకి మారడం సాధారణమే అయినా, మొక్కపై ఉన్న ఎండిన ఆకులు, దెబ్బతిన్న కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి తొలగించాలి. ఇలా చేయడం వల్ల మొక్కకు అనవసరపు భారం తగ్గి, కొత్త చిగుర్లు రావడానికి వీలవుతుంది.