
ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిక్ ఉన్నవారికి.. జొన్న జావ ఒక అద్భుతమైన పౌష్టిక ఆహారం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని ప్రతిఒక్కరూ దీనిని సులభంగా తీసుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. జొన్నలు (Sorghum) గ్లూటెన్ రహిత, పోషకాలతో కూడిన అద్భుతమైన చిరుధాన్యం.. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, బి-విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం, బరువు తగ్గడం, బలమైన ఎముకలకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ జొన్న జావా రెసిపీని ఎవరైనా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా చేసుకోని తాగవచ్చు. డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్, అధిక బరువు, థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్ వంటి హార్మోనల్ అసమతుల్యతలు ఉన్నవారు కూడా దీనిని నిస్సందేహంగా తీసుకోవచ్చు. రాగులు విషయంలో మాత్రం థైరాయిడ్ సమస్య ఉన్నవారు వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి.. కానీ.. మిగిలిన మిల్లెట్స్‌ను హాయిగా వినియోగించుకోవచ్చు. రొట్టెలు చేయడానికి సమయం లేనివారికి ఇది చాలా మంచి ఎంపిక.. ఎందుకంటే ఇది జొన్నలు తిన్నంత ప్రయోజనాన్ని అందిస్తుంది.
జొన్న జావా తయారీ చాలా సులువు. మొదట, రెండు చెంచాల జొన్నపిండిని ఉండలు కట్టకుండా నీటితో కలపాలి. ఒక గిన్నెలో తగినంత నీటిని తీసుకుని మరిగించాలి. నీరు మరిగేటప్పుడు, రుచికి సరిపడా ఉప్పు వేసి, ముందుగా కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ, ఉండలు కట్టకుండా కలియబెట్టాలి. దీనిని బాగా ఉడికించి, మనకు కావలసిన చిక్కదనం వచ్చేవరకు చూసుకోవాలి. కొంతమంది పలుచగా, మరికొందరు చిక్కగా ఇష్టపడతారు. ఉడికిన తర్వాత, దీనిని ఒక బౌల్‌లోకి తీసుకుని, పల్చటి మజ్జిగ లేదా పెరుగుతో కలుపుకోవచ్చు. రుచి కోసం బెల్లం వేసుకోవచ్చు.
వీలైతే తాలింపు కూడా వేసుకోవచ్చు.. తాలింపు కోసం, తక్కువ నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి, దానిని జావలో కలుపుకోవాలి. మట్టి కుండలో తయారుచేస్తే మరింత రుచిగా ఉంటుంది..
బరువు తగ్గే ప్రయాణంలో వ్యాయామం, నడక లేదా యోగా సాధనతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో వైవిధ్యాన్ని పాటించడం ద్వారా అన్ని పోషకాలను పొందవచ్చు. ఒకరోజు జొన్నలతో, మరో రోజు సజ్జలతో, ఇంకో రోజు రాగులతో లేదా ఇతర మిల్లెట్స్‌తో జావా చేసుకోని తాగవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..