
ప్రస్తుత జీవనశైలి, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం తీవ్రమైన సమస్యగా మారింది. ఈ సమస్యకు ప్రముఖ హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ కొన్ని సులభమైన చిట్కాలను సూచించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రీ-కండిషనింగ్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రీ-కండిషనింగ్ పద్ధతి అంటే ఏంటి..? దీనిని ఎలా పాటించాలో వివరంగా తెలుసుకుందాం..
తలస్నానానికి ముందు ప్రీ-కండిషనింగ్ చేయడం జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందని జావేద్ హబీబ్ తెలిపారు.
మొదట జుట్టును తేలికగా తడి చేయాలి. ఆ తర్వాత నూనెను జుట్టు పొడవునా రాయాలి. నూనె రాసేటప్పుడు స్కాల్ప్‌పై లేదా కుదుళ్ల వద్ద గట్టిగా మసాజ్ చేయకూడదు. జుట్టు పొడవుగా ఉంటే, నూనె రాసిన తర్వాత వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో తేలికగా దువ్వుకోవచ్చు. నూనె రాసిన 5 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
స్కాల్ప్, జుట్టును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నూనె పెట్టిన 5 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ లేదా సాంప్రదాయ పద్ధతి అయిన షికాకాయ్‌తో తలస్నానం చేయాలి. ఇది జుట్టులోని మురికిని, జిడ్డును తొలగించి కుదుళ్లను బలంగా ఉంచుతుంది.
జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు తగ్గడానికి ఒకేసారి పెద్ద మార్పులు రావు. క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో తలస్నానం చేయడం, కుదుళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కేవలం కొన్ని రోజుల్లోనే మంచి మార్పును గమనించవచ్చు. అధిక రసాయనాలు ఉన్న ఖరీదైన ఉత్పత్తుల కంటే రోజువారీ సరైన సంరక్షణే జుట్టుకు మేలు చేస్తుంది. తలస్నానానికి ముందు ఈ ప్రీ-కండిషనింగ్ పద్ధతిని పాటిస్తే జుట్టు రాలడం తగ్గి, జుట్టు దృఢంగా మరియు ఒత్తుగా మారుతుంది. అయితే, సమస్య మరీ తీవ్రంగా ఉంటే నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..