
గుడ్లు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌కు అద్భుతమైన మూలం. ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయితే ఎంతటి పోషకాహారమైనా దానిని వేటితో కలిపి తింటున్నామనే విషయంపైనే దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి గుడ్లను తీసుకుంటే, అది జీర్ణవ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగించి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
గుడ్లు – టీ: చాలామందికి గుడ్లు తిన్న వెంటనే నీచు వాసన పోవడానికో లేదా అలవాటు ప్రకారమో వేడివేడి టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ టీలోని టానిన్లు, గుడ్డులోని ప్రోటీన్లతో కలిసి జీర్ణక్రియను మందగింపజేస్తాయి. దీనివల్ల తీవ్రమైన మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
గుడ్లు – చక్కెర: గుడ్లను పంచదారతో కలిపి వండడం లేదా బేకింగ్ చేయడం వల్ల రెండింటిలోని అమైనో ఆమ్లాలు రసాయనిక చర్య జరుపుతాయి. ఇది శరీరంలో టాక్సిన్స్‌ను పెంచి, రక్తం గడ్డకట్టే ముప్పును తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుడ్లు – సోయా పాలు: సోయా పాలు, గుడ్లు రెండూ ప్రోటీన్ సమృద్ధిగా ఉండేవే. అయితే సోయా పాలలో ఉండే కొన్ని ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గుడ్డులోని ప్రోటీన్‌ను శరీరం పూర్తిగా గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా పోషకాలు అందకపోగా అజీర్తికి కారణమవుతుంది.
అధిక కొవ్వు గల మాంసం: గుడ్లతో పాటు ఎక్కువ కొవ్వు ఉండే మాంసాన్ని కలిపి తినడం వల్ల శరీరానికి క్షణికమైన శక్తి లభించినట్లు అనిపించినా, వెంటనే అలసట, నీరసం ఆవహిస్తాయి. శరీరం ఈ రెండింటినీ ఒకేసారి జీర్ణం చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.
కొన్ని రకాల పండ్లు: గుడ్లు తిన్న వెంటనే పర్సిమోన్ పండు లేదా పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినకూడదు. ఈ కలయిక వల్ల కడుపుబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
గుడ్లతో పాటు చీజ్, ఎక్కువ మోతాదులో పాల ఉత్పత్తులు, బీన్స్ వంటి అధిక ప్రోటీన్ పదార్థాలను ఒకేసారి భారీగా తీసుకోకపోవడం మంచిది. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే గుడ్డును తాజా కూరగాయలు లేదా హోల్ వీట్ బ్రెడ్‌తో కలిపి సమతుల్యంగా తీసుకోవడం మంచిది.
(గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీ శరీర తత్వాన్ని బట్టి ఏదైనా ఆహార మార్పులు చేసుకునే ముందు వైద్యులు లేదా సర్టిఫైడ్ డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.)