
టీ తయారీకి అందరూ ఒకే రకమైన పదార్థాలను ఉపయోగించినప్పటికీ, అందరి చేతి టీ ఒకే రుచిని ఇవ్వదు. కొన్ని ఇళ్లలో టీ చాలా అద్భుతంగా, కడక్‌గా ఉండటం వెనుక కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు దాగి ఉన్నాయి. నీళ్లు, టీపొడి, పాలు, చక్కెరలను సరైన క్రమంలో, ఖచ్చితమైన కొలతలతో, సరైన సమయంలో వేయడమే ఈ రుచికి అసలైన రహస్యం. అదేలాగో తెలుసుకుందాం..
చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, గిన్నెలో పాలు, నీళ్లు, టీపొడి, చక్కెర అన్నీ ఒకేసారి వేసి పొయ్యి మీద పెడతారు. ఇలా చేయడం వల్ల టీకి అసలైన ఫ్లేవర్ రాదు. పర్‌ఫెక్ట్ టీ కావాలంటే ముందుగా నీటిని మాత్రమే గిన్నెలో పోసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా తెర్లుతున్న సమయంలోనే దంచిన అల్లం లేదా యాలకులను వేయాలి. దీనివల్ల వాటిలోని రసం, సువాసన నీటిలో బాగా కలుస్తాయి. పాలు పోయడానికి కనీసం రెండు నిమిషాల ముందే వీటిని వేసి మరిగించాలి. అయితే అల్లం ముక్కలను మరీ ఎక్కువ సేపు మరిగిస్తే టీ కసరు ఎక్కే ప్రమాదం ఉంది.
నీళ్లు మరుగుతున్నప్పుడు టీపొడి వేసి మీడియం ఫ్లేమ్‌పై 3 నుండి 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. దీనివల్లనే టీకి మంచి రంగు, చిక్కదనం, డికాషన్ ఫ్లేవర్ వస్తాయి. ఆ తర్వాతే పాలు పోయాలి. టీ రుచిగా ఉండటంలో పాలు, నీళ్ల నిష్పత్తి చాలా ముఖ్యం. మరీ ఎక్కువ నీళ్లు పోస్తే టీ పల్చగా మారుతుంది, అదే ఎక్కువ పాలు పోస్తే టీ హెవీగా అనిపిస్తుంది. కాబట్టి, సమాన కొలతలతో తీసుకోవడం మంచిది.
టీ తయారీలో మరోక ముఖ్యమైన సీక్రెట్ ఏంటంటే.. చక్కెరను మొదట్లోనే వేసేస్తే అది కరిగి నీటి సాంద్రతను మార్చేస్తుంది. దీనివల్ల టీపొడి సరిగ్గా ఉడకదు. అందుకే పాలు పోసి, టీ బాగా మరిగిన తర్వాత.. దించే ముందు చివరగా చక్కెర వేసి కేవలం ఒక నిమిషం పాటు మరిగించి దించేయాలి.
హోటల్ స్టైల్ టీ రుచి రావాలంటే, టీ మరుగుతున్నప్పుడు గరిటెతో పైకి, కిందికి బాగా తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు, డికాషన్ బాగా కలిసి టీ మరింత చిక్కగా, నురగతో ఎంతో రుచిగా తయారవుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో చేసే టీ కూడా ప్రతిరోజూ అద్భుతమైన రుచితో నోరూరిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..