
ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యలలో నరాల బలహీనత ఒకటి. చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు, పాదాల్లో మంటలు, వస్తువులు ఎత్తినప్పుడు షాక్ కొట్టినట్లు అనిపించడం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు నరాల బలహీనతను సూచిస్తాయి. నిపుణుల ప్రకారం.. నరాల బలహీనతకు గల కారణాలు, లక్షణాలు తెలుసుకుందాం..
మన శరీరంలోని ప్రతి భాగంలో నరాలు ఉంటాయి. ఇవి మెదడు, స్పైనల్ కార్డ్‌తో అనుసంధానమై ఉంటాయి. నరాలు విద్యుత్ సంకేతాల ద్వారా సమాచారాన్ని శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి చేరవేస్తాయి. ఉదాహరణకు, మనం వేడి వస్తువును తాకినప్పుడు, ఆ వేడి సంకేతం నరాల ద్వారా స్పైనల్ కార్డ్‌కు, అక్కడి నుండి మెదడుకు చేరి, వెంటనే చేయి వెనక్కి తీసుకోమని ఆదేశం వస్తుంది. ఈ సంకేత వ్యవస్థ విద్యుత్ శక్తిపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో ఏదైనా అంతరాయం ఏర్పడితే నరాల బలహీనత తలెత్తుతుంది. మెదడు లేదా స్పైనల్ కార్డ్‌లో సమస్యలు ఉన్నా, నరాల బలహీనత ఏర్పడవచ్చు.
విటమిన్ బి12 లోపం: నరాల ఆరోగ్యానికి విటమిన్ బి12 చాలా అవసరం. ఈ విటమిన్ లోపించినప్పుడు తిమ్మిర్లు, మంటలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డయాబెటిక్ న్యూరోపతి: మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల నరాలు దెబ్బతింటాయి. ఇది తీవ్రమైన డయాబెటిక్ న్యూరోపతికి దారితీస్తుంది. ఇది చివరికి మనిషిని మంచానికే పరిమితం చేసే అవకాశం ఉంది. అందుకే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
మెడ (క్రివికల్) – నడుము (లంబర్) నరాలపై ఒత్తిడి: వెన్నెముకలోని డిస్క్‌లు అరిగిపోవడం వల్ల మెడ లేదా నడుము ప్రాంతంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల చేతుల్లో, కాళ్ళల్లో తిమ్మిర్లు, నొప్పి వస్తాయి.
ఒత్తిడి, రక్తపోటు, అధిక బరువు: ఈ కారకాలు కూడా నరాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. సరైన ఆహారం, బరువు నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ద్వారా నరాల బలహీనతను నివారించవచ్చు.
వర్టిగో (తలతిరగడం): కళ్ళు తిరిగినట్లు అనిపించడం (డిజీనెస్), గది చుట్టూ తిరిగినట్లు అనిపించడం (వర్టిగో) కూడా నరాల సమస్యలే. చెవిలో సమస్యల వల్ల లేదా మెడ నరంపై ఒత్తిడి వల్ల కూడా వర్టిగో రావచ్చు.
నరాల ఆరోగ్యానికి నిపుణులు ఒక అద్భుతమైన సహజ నివారణను సూచిస్తున్నారు. అదేంటంటే.. నువ్వుల పొడి. నువ్వుల లడ్డూలలో బెల్లం ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి అనుకూలం కాదని, నువ్వుల పొడి ఉత్తమమని ఆయన తెలిపారు.
నువ్వుల పొడిని తయారుచేసుకునేటప్పుడు, అందులో కొన్ని మిరియాలు, తక్కువ ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు చేర్చాలి.
భోజనం చేసేటప్పుడు, అన్నంలో మొదట రెండు ముద్దలు ఈ నువ్వుల పొడిని కొద్దిగా ఆవు నెయ్యితో కలిపి తినాలి.
నరాల బలహీనత అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందువల్ల, సరైన చికిత్స, జీవనశైలి మార్పులు, సహజ నివారణలను పాటించడం ద్వారా నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే, ఏదైనా ఆరోగ్య సమస్యలకు, వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.. సొంత చికిత్సలను ఎప్పుడూ పాటించకండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..