
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి పోషకాహారం అవసరం. అలాంటి వారికి అస్సలు నూనె వాడకుండానే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన సొరకాయ జొన్న రొట్టె ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ రెసిపీని అప్పటికప్పుడు ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి భోజనంగా కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతో సులభంగా సిద్ధం చేసుకోవచ్చు.
ముందుగా సొరకాయని తొక్క తీసి శుభ్రంగా కడిగి తురుముకోవాలి. తురిమిన సొరకాయ నుండి నీటిని పిండకుండా అలాగే ఉంచుకోవాలి. ఈ తడి పిండి కలపడానికి సహాయపడుతుంది.
ఒక పెద్ద గిన్నెలో తురిమిన సొరకాయ, జొన్న పిండి, శనగ పిండి తీసుకోవాలి.
ఇప్పుడు దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు చేర్చి బాగా కలపాలి.
మొదట నీటిని కలపకుండా సొరకాయలోని తడితోనే పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఇంకా గట్టిగా అనిపిస్తే, చపాతీ పిండి కంటే కాస్త మృదువుగా ఉండేలా కొద్దికొద్దిగా నీళ్లు చిలకరించి కలుపుకోవాలి.
రొట్టెను వత్తడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఒక పాలిథిన్ షీట్ లేదా బటర్ పేపర్‌పై కొద్దిగా నూనె రాసి, పిండి ముద్దను తీసుకొని సన్నగా రొట్టెలా వత్తుకోవాలి. రెండో పద్ధతి, ఒక తడి పత్తి వస్త్రాన్ని నీటిలో ముంచి, నీళ్లు పిండేసి, ఆ తడి వస్త్రంపై పిండిని రొట్టెలా వత్తుకోవాలి. నూనె లేకుండా కాల్చడానికి తడి వస్త్రం పద్ధతి ఉత్తమం.
పెనంను వేడి చేసి, దానిపై కొద్దిగా నూనె వేసి రొట్టెను కాల్చుకోవచ్చు. నూనె వాడకూడదనుకునే వారు పెనం వేడెక్కిన తర్వాత నూనె లేకుండానే రొట్టెను వేయాలి. తడి వస్త్రంపై వత్తిన రొట్టెను పెనంపై బోర్లించి, వస్త్రాన్ని జాగ్రత్తగా తీసేయాలి.
రొట్టె ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి రెండు వైపులా చక్కగా బంగారు రంగు వచ్చేవరకు లేదా బాగా ఉడికే వరకు కాల్చుకోవాలి. నూనె లేకుండా కాల్చేటప్పుడు, రొట్టె పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించవచ్చు.
ఇలా తయారుచేసుకున్న సొరకాయ జొన్న రొట్టెను వేడివేడిగా ఏదైనా పచ్చడి, పెరుగు రైతా లేదా మీకు నచ్చిన సైడ్ డిష్‌తో సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూరలు లేని సమయంలో ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం..
ఈ సొరకాయ జొన్న రొట్టెలో ఫైబర్ అధికంగా ఉంటుంది.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. జొన్న పిండి గ్లూటెన్ రహితం.. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అదనంగా, నూనె లేకుండా తయారుచేయడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి కూడా సురక్షితం. ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో, తక్కువ సమయంలో తయారుచేయగల ఈ ఆరోగ్యకరమైన రెసిపీని ప్రయత్నించండి. జొన్న రొట్టె తినని పిల్లలు కూడా సొరకాయ కలపడం వల్ల ఇష్టంగా తింటారు.