బలహీనత ముచ్చటే ఉండదు.. మటన్‌లోని ఈ సెట్ తింటే.. దెబ్బకు మీ బాడీ సెట్ అయినట్లే..

మటన్ లివర్ సెట్‌లో కాలేయం, తిల్లి, గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవ మాంసాలు ఉంటాయి. వీటిలో ఐరన్, విటమిన్ బి12, ప్రొటీన్లు సహా పలు పోషకాలు లభిస్తాయి. అయితే వీటిని తినడం వల్ల బలహీనత తొలగిపోతుందని పెద్దలు చెబుతున్నారు. మటన్ లివర్ సెట్ పోషక ప్రయోజనాలు ఏమిటి? ఎలా తయారు చేసుకోవాలి.. అనే విషయాలను తెలుసుకోండి..

బలహీనత ముచ్చటే ఉండదు.. మటన్‌లోని ఈ సెట్ తింటే.. దెబ్బకు మీ బాడీ సెట్ అయినట్లే..
Mutton Liver Set

Updated on: Oct 21, 2026 | 12:12 PM

పండుగలు వచ్చినా.. చుట్టాలొచ్చినా.. వీకెండ్ వచ్చినా.. నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లల్లో చికెన్, మటన్, ఫిష్ లాంటివి ఉండాల్సిందే.. ముఖ్యంగా మటన్.. చాలామంది పండుగల వేళల్లో మటన్ (మేక మాంసం) కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే.. సాధారణంగా మాంసాహార ప్రియులు మటన్‌ (మేక మాంసం) లోని వివిధ భాగాలను ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు. లివర్, తిల్లి, కాళ్లు, తలకాయ, హార్ట్.. ఇలా అన్నింటిని మంచిగా తింటారు.. అయితే, మేకలోని కాలేయం (Liver), తిల్లి (Spleen), గుండె (Heart), ఊపిరితిత్తులు (Lungs) వంటి అంతర్గత అవయవాలను కలిపి షాపుల్లో ‘లివర్ సెట్’గా విక్రయిస్తుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి..

ఈ ప్రత్యేకమైన కాంబినేషన్‌ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మటన్ లివర్ సెట్ పోషకాలు – ఆరోగ్య ప్రయోజనాలు:

విటమిన్లు, ఖనిజాల నిలయం: మటన్ లివర్, తిల్లి, గుండె, లంగ్స్.. ఈ అవయవ మాంసాల్లో ఐరన్, విటమిన్-ఏ, విటమిన్ బి-12, అత్యుత్తమ ప్రొటీన్లు అధిక శాతంలో ఉంటాయి.

ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, అనెమియా సమస్యను తగ్గించడంలో ఈ పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి.

అంతేకాకుండా.. రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు శారీరక బలహీనతను తొలగించి తక్షణ ఉత్సాహాన్ని అందిస్తాయి. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను బాగా అందించి.. బలంగా మారేలా చేస్తాయి..

రుచికరమైన ‘లివర్ సెట్ ఫ్రై’ తయారీ పద్ధతి:

కావలసిన పదార్థాలు – వంట విధానం:

లివర్, తిల్లి, గుండె, లంగ్స్ ముక్కలు, నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, గరం మసాలా, తగినంత ఉప్పు.

ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు చేర్చాలి. అనంతరం శుభ్రం చేసిన లివర్ సెట్ ముక్కలను వేసి బాగా వేయించాలి.

ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ముక్కలు మాడిపోకుండా చివరగా చిటికెడు గరం మసాలాతో పాటు రెండు చెంచాల నీటిని చల్లుకోవాలి.

మధ్యస్థ మంటపై కొద్దిసేపు ఉడికించి, నీరంతా ఆరిపోయే వరకు డ్రైగా వేయించుకుంటే ఘుమఘుమలాడే లివర్ సెట్ ఫ్రై సిద్ధమవుతుంది.

దీన్ని వేడివేడి అన్నంతో లేదా సాయంత్రం వేళల్లో స్నాక్‌లా తీసుకోవచ్చు. అయితే, వీటిలో కొలెస్ట్రాల్, విటమిన్-ఏ మోతాదు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. సమస్యలున్నా ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us