Mutton: మటన్‌లో ఈ పార్ట్స్ జోలికి వెళ్లకండి.. తింటే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే..

మటన్ షాపుకు వెళ్లినప్పుడు లివర్, గుండె, కిడ్నీల కోసమే ఎక్కువ పోటీ పడుతుంటారా? ప్లేట్‌లో ఇవి ఉంటే ఆ రుచే వేరు అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. చాలా మంది వీటిని పోషకాల నిధి అని పిలుస్తారు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ అవయవాల మాంసం అందరికీ సురక్షితం కాదు. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Mutton: మటన్‌లో ఈ పార్ట్స్ జోలికి వెళ్లకండి.. తింటే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే..
Is Mutton Liver And Kidney Safe For Everyone

Updated on: Jul 04, 2026 | 11:57 AM

మటన్ తినే చాలా మంది ప్లేట్‌లో బోన్‌లెస్ ముక్కలతో పాటు లివర్, గుండె, కిడ్నీలు వంటి అవయవాల మాంసం తప్పకుండా కనిపిస్తుంది. దీనిని సాధారణంగా ఆఫ్ఫల్ లేదా అవయవ మాంసం అని పిలుస్తారు. ఎంతో రుచిగా ఉండే ఈ భాగాలను చాలా మంది పోషకాల నిధిగా భావిస్తారు. నిజానికి ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. వైద్యుల ప్రకారం ఈ అవయవాల మాంసం అందరికీ సురక్షితం కాదు. కొంతమందికి దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. పరిమితంగా తింటే ఈ అవయవాల మాంసం వల్ల శరీరానికి అద్భుతమైన పోషకాలు అందుతాయి.

రక్తహీనతకు చెక్: కాలేయం, మూత్రపిండాలు, గుండె భాగాలలో విటమిన్ బి 12, ఐరన్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఐరన్ లోపంతో బాధపడేవారు వీటిని తగిన మోతాదులో తింటే శరీరంలో ఇనుము స్థాయిలు పెరిగి, నీరసం, అలసట వంటి సమస్యలు దూరమవుతాయి.

మెదడు పనితీరు: కాలేయంలో ఉండే విటమిన్ బి-1, ఇతర ముఖ్య పోషకాలు మెదడు చురుగ్గా పనిచేయడానికి తోడ్పడతాయి.

క్యాన్సర్ నివారణ: శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ బి 2 కీలక పాత్ర పోషిస్తుంది.

హోమోసిస్టీన్ నియంత్రణ: కాలేయం, గుండె, కిడ్నీలలో లభించే బి12, ఫోలేట్.. రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. దీనివల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు

ప్రముఖ ఆరోగ్య వెబ్‌సైట్ వెబ్‌ఎండి ప్రకారం.. కాలేయం, మూత్రపిండాలు వంటి భాగాలను ప్రతిరోజూ లేదా అతిగా అస్సలు తినకూడదు. ముఖ్యంగా కింది సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి:

గుండె జబ్బులు – హై కొలెస్ట్రాల్: మేక కాలేయం, గుండె భాగాలలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు దీనిని తింటే గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తీవ్రంగా పెరుగుతుంది.

కీళ్లనొప్పులు: అవయవ మాంసంలో ప్యూరిన్ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు, వాపులు తీవ్రతరమవుతాయి. కాబట్టి కీళ్లనొప్పుల సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది.

హెమోక్రోమాటోసిస్ బాధితులు: ఈ వ్యాధి ఉన్నవారి శరీరంలో ఇప్పటికే ఐరన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ అధికంగా ఉండే కాలేయం వంటి ఆహారాలను వీరు తింటే శరీరం మరింత ఇనుమును నిల్వ చేసుకుని తీవ్ర హాని జరుగుతుంది.

ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇలాగే తినాలి..

మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని పూర్తి ఆరోగ్యవంతులైనప్పటికీ.. లివర్, కిడ్నీలు వంటి అవయవ మాంసాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోకూడదు. వీటిని అప్పుడప్పుడు, అది కూడా చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీకు గుండె జబ్బు, హై కొలెస్ట్రాల్, కీళ్లవాపు లేదా ఐరన్ ఓవర్‌లోడ్ వంటి సమస్యలు ఉంటే.. వీటిని ముట్టే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

Follow Us