సీ ఫుడ్ అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అందులో రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం. రొయ్యలను ఎక్కువగా బిర్యానీలో వేసి వండుతూ ఉంటారు. రొయ్యలు కూడా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడైనా తినడం మంచిది. అందులోనూ పెద్ద రొయ్యల కంటే చిట్టి రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి. ఈ చిట్టి రొయ్యల్లో వంకాయలు, టమాటాలు, గుడ్లు, ములక్కాడ, బెండకాలు, బీరకాలయు ఇలా ఎలాంటి వెజిటేబుల్స్ వేసుకుని అయినా వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా వంకాయ, చిట్టి రొయ్యల ఇగురు మరింత టేస్టీగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని కలిపి ఒక్క ముద్ద తింటే మాటలు ఇక ఉండవు. కేవలం తింటూనే ఉంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. మరి వంకాయలు వేసి పచ్చి రొయ్యల కూర ఎలా చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
శుభ్రం చేసిన రొయ్యలు, వంకాయలు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఆయిల్, కొత్తిమీర.
ముందుగా పచ్చి రొయ్యలను శుభ్రం చేసి.. ఓ పాత్రలో వేసుకోవాలి. ఇందులో పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టాలి. కాసేపటికి నీరంతా బయటకు వస్తుంది. ఇలా నీరంతా బయటకు పోయేంత వరకు ఉడికించాలి. కొద్దిగా నీరు ఉన్నప్పుడు వంచేసి రొయ్యలను పక్కన పెట్టాలి. ఇప్పుడు కర్రీ చేసే పాన్ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగాక.. వంకాయ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత రొయ్యలు కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. నెక్ట్స్ సరిపడా నీళ్లు వేసి ఒక ఉడుకు వచ్చాక గరం మసాలా వేసి కలపాలి. ఇలా నీరంతా ఇంకేదాకా చివరిలో కొత్తిమీర వేసి కలిపి దగ్గరగా ఇగురు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయలు, పచ్చి రొయ్యల కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి చేయండి. రుచి అదిరిపోతుంది.