నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో మాంసాహార ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరికి ప్రతి రోజూ ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అయితే ఎప్పుడూ తినే ఒకే లాంటి ఐటెమ్స్ కాకుండా కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఫిష్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కాస్త ఓపిక కావాలి. మీడియం మంట మీద జాగ్రత్తగా ఫ్రై చేయాలి. సాధారణంగా ఎప్పుడూ చేసే ఫిష్ ఫ్రై కంటే.. ఈ చెట్టినాడ్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై చేయండి. ఖచ్చితంగా అదిరింది అంటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఈ చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చేపలు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మెంతులు, ధనియా పొడి, శనగపిండి, బియ్యం పిండి, ఆయిల్.
ముందుగా చేపల ముక్కలను నీచు వాసన రాకుండా శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని అందులో.. ఉల్లిపాయ, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మెంతులు, ధనియా పొడి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత శనగ పిండి, బియ్యం పిండి కూడా వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చేపలకు పట్టించండి. ఆ తర్వాత ఓ అరగంట పాటు మ్యారినేట్ చేయడానికి ఫ్రిజ్‌లో ఉంచండి.
నెక్ట్స్ పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. చేప ముక్కలను వేసి రెండు వైపులగా ఎర్రగా మీడియం మంట మీద వేయించాలి. పెద్ద మంట పెడితే పైన మాడిపోయి.. లోపల ఉడకవు. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేయాలి. లేదంటే పాన్ తీసుకుని.. కొద్దిగా ఆయిల్ వేసి షాలో ఫ్రై కూడా చేయవచ్చు. చివరంగా నిమ్మరసం పిండి కొత్తి మీర చల్లితే ఎంతో రుచికరమైన చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై సిద్ధం.