Jhalmuri: ప్రధానమంత్రి మోదీ తిన్న జల్మురిని మీరు రుచి చూడాలనుకుంటున్నారా? ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

ఇటీవల పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణంలో 'ఝల్‌మురి' (మరమరాల మసాలా) రుచి చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ప్రధాని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ వీడియోను కేవలం 24 గంటల్లోనే 10 కోట్లకు పైగా ప్రజలు వీక్షించారు. స్థానిక వ్యాపారి విక్రమ్ సాహా తయారు చేసిన ఈ రుచికరమైన అల్పాహారాన్ని తిని మోదీ ఎంతో ఆనందించారు. అంతటి విశిష్టత ఉన్న ఈ బెంగాలీ స్పెషల్ స్నాక్‌ను మీరు కూడా రుచి చూడాలనుకుంటున్నారా? ఎక్కువ ఖర్చు లేకుండా, అతి తక్కువ శ్రమతో ఇంట్లోనే అచ్చం దుకాణంలో దొరికే విధంగా జల్మురిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

Jhalmuri: ప్రధానమంత్రి మోదీ తిన్న జల్మురిని మీరు రుచి చూడాలనుకుంటున్నారా? ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
Jhalmuri Recipe West Bengal Style

Updated on: Apr 23, 2026 | 12:44 PM

కావలసిన పదార్థాలు..

మరమరాలు – 2-3 కప్పులు

ఉడికించిన మినప పప్పు (లేదా మొలకెత్తినవి) – 1/4 కప్పు

వేయించిన వేరుశెనగలు – 1/4 కప్పు

తరిగిన ఉల్లిపాయ – 1

తరిగిన టమోటా – 1

తరిగిన దోసకాయ – 1

చిన్న పచ్చి మిరపకాయ – 1

నల్ల ఉప్పు – 1/2 టీస్పూన్

వేయించిన జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్

కారం పొడి – రుచికి తగినంత

ఆవ నూనె – 1 టీస్పూన్

నిమ్మరసం – 1 టీస్పూన్

సన్నగా తరిగిన కొత్తిమీర, సేవ్ – అలంకరణ కోసం

జల్మురి తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, దోసకాయ ముక్కలు ఉడికించిన పప్పును వేయాలి. ఆ తర్వాత నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కారం ముఖ్యంగా ఝల్‌మురికి ప్రత్యేక రుచిని ఇచ్చే ఆవ నూనెను కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో వేయించిన వేరుశెనగలు మరమరాలను వేసి అన్ని పదార్థాలు కలిసేలా వేగంగా కలపాలి. చివరగా నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర సన్నటి సేవ్ (కారాపూస)తో అలంకరిస్తే నోరూరించే ఝల్‌మురి సిద్ధం.

చిట్కాలు..
ఈ జల్‌మురిని తయారు చేసిన వెంటనే తినడం మంచిది. ఎందుకంటే మరమరాలు ఎక్కువ సేపు ఉంటే కూరగాయల్లోని తేమ వల్ల మెత్తగా అయిపోతాయి. వెంటనే తింటేనే ఆ కరకరలాడే రుచి మీకు తెలుస్తుంది. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా, నూనె తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన చిరుతిండి కూడా. ఆవ నూనె ఘాటు ఈ వంటకానికి పశ్చిమ బెంగాల్‌ ప్రామాణిక రుచిని అందిస్తుంది. అతి తక్కువ సమయంలో ఇంట్లోనే చేసుకునే ఈ జల్మురి సాయంత్రం వేళ టీతో పాటు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రధాని మోదీ మెచ్చిన ఈ అల్పాహారాన్ని మీరు కూడా ఈరోజే ప్రయత్నించి చూడండి.

గమనిక: ఈ రెసిపీ సాధారణంగా ప్రాచుర్యంలో ఉన్న పద్ధతులు సమాచారం ఆధారంగా రూపొందించబడింది. మీ రుచికి అనుగుణంగా మసాలాలు లేదా నిమ్మరసం పరిమాణాన్ని మార్చుకోవచ్చు. ఆవ నూనె పడని వారు సాధారణ వంట నూనెను వాడవచ్చు, కానీ అసలు రుచి ఆవ నూనెతోనే వస్తుంది. ఆహార అలర్జీలు ఉన్నవారు పదార్థాలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించగలరు.

Follow Us