చికెన్, మటన్ వండేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

మాంసాహారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు..? ముక్క నోట్లో పెడితే కరిగిపోవాలి.. మసాలాలు జుర్రుకుంటూ తింటుంటే ఆ మజాయే వేరు! కానీ, మీరు వండే పద్ధతిలో చిన్న పొరపాటు జరిగితే అది రుచికరమైన విందు కాదు, విషపూరితమైన ఫుడ్ పాయిజనింగ్‌గా మారే ప్రమాదం ఉంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి మాంసాన్ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చికెన్, మటన్ వండేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..
How To Cook Meat Perfectly

Updated on: Apr 23, 2026 | 8:06 PM

నాన్‌వెజ్ ప్రియులకు చికెన్, మటన్, ఫిష్ మస్త్ ఇష్టంగా తింటారు. అసలు ముక్క లేనిదే ముద్ద దిగని వారు మనలో చాలా మంది ఉన్నారు. అయితే చాలామంది మాంసం వండేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు వంటకం రుచిని చెడగొట్టడమే కాకుండా, తీవ్రమైన అనారోగ్య సమస్యలకు, ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంటకం రుచిగా ఉండాలంటే మొదట మీరు ఎంచుకునే మాంసం తాజాగా ఉండాలి. గడ్డకట్టిన మాంసం కంటే అప్పటికప్పుడు కోయించిన మాంసం ఉత్తమం. మాంసాన్ని కోసేటప్పుడు ముక్కలన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. కొన్ని పెద్దవిగా, కొన్ని చిన్నవిగా ఉంటే.. చిన్న ముక్కలు కరిగిపోతాయి, పెద్ద ముక్కలు పచ్చిగా ఉండిపోతాయి.

మ్యారినేషన్ మస్ట్

చికెన్ లేదా మటన్‌ను నేరుగా ఉడికించడం కంటే మ్యారినేట్ చేయడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పు, పెరుగు లేదా నిమ్మరసం కలిపిన మసాలాల్లో నానబెట్టడం వల్ల మాంసం లోపల నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. దీనివల్ల ముక్క గట్టిగా అవ్వకుండా మెత్తగా, జ్యూసీగా వస్తుంది. మ్యారినేషన్ వల్ల మసాలాలు ముక్క లోపలి వరకు వెళ్లి అద్భుతమైన రుచిని ఇస్తాయి.

డీఫ్రాస్టింగ్

ఫ్రిజ్ నుండి తీసిన గడ్డకట్టిన మాంసాన్ని కరిగించే విషయంలోనే చాలా మంది పొరపాట్లు చేస్తారు. మాంసాన్ని గంటల తరబడి బయట ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. వండటానికి కొన్ని గంటల ముందే మాంసాన్ని ఫ్రీజర్ నుండి తీసి రిఫ్రిజిరేటర్ కింది అరలో ఉంచాలి. త్వరగా కావాలంటే సాధారణ నీటిలో ముంచి ఉంచాలి కానీ, నేరుగా వేడి నీటిలో వేయకూడదు.

ఉష్ణోగ్రత

మాంసం వండేటప్పుడు పాత్రపై మూత పెట్టడం చాలా ముఖ్యం. ఇది ఆవిరిని లోపలే ఉంచి, మాంసాన్ని లోపలి వరకు సమానంగా ఉడికిస్తుంది. కోడి లేదా మేక మాంసం వండేటప్పుడు ఎముకల దగ్గర ఎర్రటి రక్తం కనిపిస్తే అది ఇంకా ఉడకలేదని అర్థం. ఇలాంటి పచ్చి మాంసం తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

వంటగది పరిశుభ్రత

వంట చేసేటప్పుడు మనం పాటించే శుభ్రత మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మాంసం కోయడానికి వాడిన కత్తి, చాపింగ్ బోర్డ్‌ను వెంటనే వేడి నీటితో కడగాలి. అదే కత్తితో కూరగాయలు కోస్తే మాంసంలోని సాల్మొనెల్లా, ఇ-కోలి వంటి బ్యాక్టీరియాలు కూరగాయలకు వ్యాపిస్తాయి. వండిన మాంసాన్ని 2 గంటల కంటే ఎక్కువ సేపు బయట ఉంచకూడదు. మిగిలిన వంటకాన్ని వెంటనే ఫ్రిజ్‌లో భద్రపరచాలి.

Follow Us