
ఈ రోజు మేము మీకు అందిస్తున్న ఇవాల్టి స్పెషల్ రెసిపీ పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ పూరీ కర్రీ. దీనిని బొంబాయి చట్నీ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పూరీలకు, దోసెలకు ఇది చాలా ప్రసిద్ధి చెందిన కాంబినేషన్. ఈ సరళమైన ఉల్లిపాయ కూరని సరైన కొలతలు, పద్ధతులు పాటిస్తే ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్ గా, అందరికీ నచ్చేలా వస్తుంది.
నూనె: 2 టీస్పూన్లు, ఆవాలు: అర టీస్పూన్, శనగపప్పు: 1 టీస్పూన్ , మినప్పప్పు: 1 టీస్పూన్ , జీలకర్ర: ముప్పావు చెంచా, ఎండుమిర్చి: 2 (తరుగు), కరివేపాకు: 1 రెబ్బ, పచ్చిమిర్చి: 2 (చీలికలు), ఉల్లిపాయలు: పావు కిలో (పొడవుగా, సన్నగా తరిగినవి), పసుపు: అర టీస్పూన్, నీళ్లు: 500 మి.లీ, ఉప్పు: రుచికి సరిపడా, శెనగపిండి: 2 టీస్పూన్లు, అల్లం తరుగు: 1 టీస్పూన్, ఉడికించిన ఆలూ (బంగాళాదుంప): 1 (చిదిమినది) , నిమ్మరసం: 1 టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా. చివరి 3 మీకు ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు.
1. ముందుగా ఒక పాన్ లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అర టీస్పూన్ ఆవాలు వేసి చిటపటమనే వరకు వేపుకోవాలి.
2. ఆవాలు చిటపటమన్నాక, శెనగపప్పు, ఒక టీస్పూన్ మినప్పప్పు వేసి సగం పైన వేగే వరకు వేపాలి.
3. ఇప్పుడు ముప్పావు చెంచా జీలకర్ర, రెండు ఎండుమిర్చి తరుగు వేసి వేపాలి. తరువాత ఓ రెబ్బ కరివేపాకు, రెండు కారం గల పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలపాలి.
4. తరువాత, పావు కిలో పొడవుగా రిబ్బన్స్ గా తరిగిన ఉల్లిపాయ తరుగు, అర టీస్పూన్ పసుపు వేసి, మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద వేపాలి. ఉల్లిపాయలను ఎక్కువగా వేపితే, తినేటప్పటికి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది, కూర రుచి అస్సలు బాగుండదని గుర్తుంచుకోండి.
5. ఉల్లిపాయలు మూడు నిమిషాలు వేగిన తర్వాత, 500 మిల్లీలీటర్ల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి, పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
6. ఈలోగా, రెండు టీస్పూన్ల శెనగపిండిలో 50 మిల్లీలీటర్ల నీళ్లు పోసి, ఉండలు అస్సలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
7. ఉల్లిపాయ పూర్తిగా ఉడికి ట్రాన్సపరెంటుగా, పట్టుకుంటే సాఫ్ట్ గా ఉండాలి. మెత్తగా ఉడకకూడదు. ఈ దశలో శెనగపిండి మిశ్రమం పోసి, ఒక టీస్పూన్ అల్లం తరుగు కూడా వేసి బాగా కలుపుకుంటూ కూరని దగ్గర పడనివ్వాలి.
8. అప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత మెత్తగా ఉడికించుకున్న ఆలూని చిదిమి వేసి కలుపుకోవచ్చు. ఆలూ, నిమ్మరసం ఆప్షనల్. ఇవి వేస్తే ఒక రుచి, వేయకపోతే మరొక రుచి.
9. చివరగా స్టవ్ ఆపేసి ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి. నిమ్మరసం కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు, కానీ మరీ ఎక్కువగా మాత్రం వేయకండి, అది కూర ఫ్లేవర్స్ ని డామినేట్ చేస్తుంది. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అయితే హోటల్ స్టైల్ లో సాధారణంగా వేయరు. ఈ కొలతలతో మీరు చేయండి. పక్కాగా హోటల్ రుచి వచ్చి తీరుతుంది, అందరికీ నచ్చి తీరుతుంది.