Popcorn Chicken: పిల్లలకు ఎంతో ఇష్టమైన పాప్‌కార్న్ చికెన్ ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ

వీకెండ్ వచ్చిందంటే చాలు పిల్లలు రెస్టారెంట్ తిండి కోసం మారాం చేస్తుంటారు. ముఖ్యంగా KFCకి వెళ్తే అందరూ ముందుగా ఆర్డర్ చేసేది పాప్‌కార్న్ చికెన్. చిన్న చిన్న ముక్కలుగా, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ చికెన్ స్నాక్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అపరిశుభ్రమైన నూనెలు వాడే బయటి తిండి కంటే, మన కళ్ల ముందే స్వచ్ఛమైన పదార్థాలతో చేసే ఈ హోమ్ మేడ్ పాప్‌కార్న్ చికెన్ ఎంతో సేఫ్.

Popcorn Chicken: పిల్లలకు ఎంతో ఇష్టమైన పాప్‌కార్న్ చికెన్ ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ
Kfc Style Popcorn Chicken Recipe

Updated on: Mar 30, 2026 | 7:15 PM

పాప్‌కార్న్ చికెన్ పర్ఫెక్ట్‌గా రావాలంటే చికెన్ మ్యారినేషన్ కోటింగ్ చాలా ముఖ్యం. వెల్లుల్లి పొడి, మిరియాల పొడి గుడ్డు కాంబినేషన్ తో చేసే ఈ వంటకం అచ్చం బ్రాండెడ్ అవుట్‌లెట్లలో దొరికే రుచినే అందిస్తుంది. అసలు చికెన్ ముక్కలు నూనె పీల్చకుండా, క్రంచీగా ఎలా వేయించాలి? అనే ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు వివరంగా చూద్దాం…

కావలసిన పదార్థాలు:

అర కిలో బోన్‌లెస్ చికెన్ (చిన్న ముక్కలు)

వెల్లుల్లి పొడి – 1/2 టీస్పూన్

మిరియాల పొడి – 1/4 టీస్పూన్

కారం పొడి – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత

గుడ్లు – 2

మైదా పిండి – 1 కప్పు

వేయించడానికి సరిపడా నూనె

తయారీ విధానం:

చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి. అందులో వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఉప్పు కారం వేసి బాగా కలపండి. మసాలాలు ముక్కలకు బాగా పట్టేలా 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి.

ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి బాగా గిలకొట్టండి. మరో వెడల్పాటి గిన్నెలో మైదా పిండిని తీసుకోండి.

ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని ముందుగా గిలకొట్టిన గుడ్డు మిశ్రమంలో ముంచండి. ఆ తర్వాత మైదా పిండిలో వేసి పిండి ముక్కకు అన్ని వైపులా పట్టేలా దొర్లించండి. మరింత క్రిస్పీగా కావాలంటే మళ్లీ గుడ్డులో ముంచి రెండోసారి పిండిలో దొర్లించండి (డబుల్ కోటింగ్).

బాణలిలో నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె మరిగిన తర్వాత మంటను మధ్యస్థంగా ఉంచి చికెన్ ముక్కలను వేయండి.

చికెన్ ముక్కలు లేత గోధుమ రంగు లోకి వచ్చి కరకరలాడే వరకు 3 నుండి 5 నిమిషాల పాటు వేయించి తీసేయండి. అదనపు నూనెను టిష్యూ పేపర్‌తో తుడిచేయండి.

వేడి వేడి పాప్‌కార్న్ చికెన్‌ను టమాటా కెచప్ లేదా మాయోనైజ్‌తో వడ్డిస్తే ఆ రుచి అద్భుతం. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.

మీ దగ్గర వెల్లుల్లి పొడి లేకపోతే, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వాడవచ్చు. చికెన్ ముక్కలు చాలా చిన్నవిగా ఉంటేనే పాప్‌కార్న్ స్టైల్ లుక్ రుచి వస్తాయి.

Follow Us