మోమోస్ లవర్స్ జాగ్రత్త.. తినేముందు ఈ నిజాలు ఒక్కసారి తెలుసుకోండి..

ఆకలి వేసినా, సరదాగా ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినా ఇప్పుడు అందరి ఛాయిస్ మోమోలే. అయితే చూడటానికి మెత్తగా, నోరూరించేలా కనిపించే మోమోస్ వెనుక ఎంతటి ఆరోగ్య ముప్పు దాగి ఉందో తెలుసా? అది కేవలం మైదా ఉండ మాత్రమే కాదు.. సైలెంట్ కిల్లర్.. ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న ఆ చేదు నిజాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

మోమోస్ లవర్స్ జాగ్రత్త.. తినేముందు ఈ నిజాలు ఒక్కసారి తెలుసుకోండి..
Hidden Dangers Of Eating Momos Regularly

Updated on: Apr 12, 2026 | 12:47 PM

భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి వేగంగా మారుతోంది. సమోసాలు, బజ్జీల స్థానాన్ని ఇప్పుడు మోమోస్ ఆక్రమించేశాయి. స్టీమ్డ్, తందూరి, ఫ్రైడ్, పెరి పెరి.. ఇలా రకరకాల ఫ్లేవర్లలో లభిస్తూ నోరూరిస్తున్న ఈ మోమోలు, ఆరోగ్యానికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రుచి కోసం వీటిని నిత్యం తినడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మోమోస్ తయారీలో ప్రధానంగా వాడేది మైదా. ఇది శరీరానికి అత్యంత హానికరం. మైదాలో ఫైబర్ అస్సలు ఉండదు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, తీవ్రమైన మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి, శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు మరియు విటమిన్లు శూన్యం. ఇది కేవలం ఖాళీ కేలరీలను మాత్రమే శరీరానికి అందిస్తుంది.

రక్తపోటు – గుండెపై ప్రభావం

మోమోస్‌తో పాటు ఇచ్చే ఆ ఎర్రటి కారంగా ఉండే చట్నీలు, సాస్‌లు రుచిగా ఉన్నా, లోపల భారీ ప్రమాదాన్ని దాచి ఉంచుతాయి. సాస్‌లలో ఉండే మోతాదుకు మించిన సోడియం రక్తపోటును పెంచుతుంది. వేయించిన మోమోస్‌లో ఉండే ట్రాన్స్-ఫ్యాట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె జబ్బులకు దారితీస్తాయి.

డయాబెటిస్ ముప్పు.. జాగ్రత్త

శుద్ధి చేసిన పిండితో చేసిన మోమోలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని తగ్గించి, చిన్న వయస్సులోనే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆ సాస్‌లే అసలైన విలన్లు

మోమోస్‌తో ఇచ్చే కారంగా ఉండే ఎర్ర చట్నీలలో కృత్రిమ రంగులు, రుచులు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కడుపులోని లైనింగ్‌ను దెబ్బతీసి, గ్యాస్ట్రిక్ అల్సర్లకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల సూచన

ఆహారాన్ని ఆస్వాదించడం తప్పు కాదు, కానీ అది మన ఆరోగ్యాన్ని బలి తీసుకోకూడదు.

పరిమితి విధించుకోండి: మోమోలను ప్రతిరోజూ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. అప్పుడప్పుడు (నెలలో ఒకట్రెండు సార్లు) రుచి కోసం తినడం వల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు.

ప్రత్యామ్నాయాలు: మైదాకు బదులుగా గోధుమ పిండితో ఇంట్లోనే వండుకుని తినడం మంచిది.

ఆరోగ్యకరమైన చట్నీ: కృత్రిమ సాస్‌లకు బదులుగా ఇంట్లో తయారు చేసిన టొమాటో లేదా కొత్తిమీర చట్నీని వాడండి.

రుచి కోసం ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు. బరువు పెరగడం, పోషకాహార అసమతుల్యత వంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే మోమోస్ వినియోగంపై నియంత్రణ అవసరం. గుర్తుంచుకోండి.. రుచి క్షణకాలం, ఆరోగ్యం జీవితకాలం.

Follow Us