
వయసు పైబడిన కొద్దీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. షుగర్, బీపీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ వయస్సులో జీర్ణశక్తి తగ్గడం, బలహీనత, కీళ్ల నొప్పులు వంటివి కూడా అధికంగా ఉంటాయి. చిన్ననాటి నుంచి అలవాటు పడిన ఆహారాన్ని ఈ వయసులో కొనసాగించడం సరైంది కాదని వైద్య నిపుణులు, డైటీషియన్లు స్పష్టంచేస్తున్నారు. పెద్దలు తమ ఆహారపు అలవాట్లలో, జీవనశైలిలో కొన్ని నియమాలను, సమయపాలనను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించుకొని, ఇతరులపై ఆధారపడకుండా ఆనందంగా జీవించవచ్చని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు పేర్కొంటున్నారు.
వృద్ధాప్యంలో ఆరోగ్యం, బలం కోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి.. జీవనశైలిలో మార్పులు గురించి డా. మంతెన సత్యనారాయణ రాజు చేసిన సూచనలు ఏంటో తెలుసుకుందాం..
పెద్ద వయసు వారు టీవీ చూస్తూ, అటూ ఇటూ నడుస్తూ నాలుగైదు సార్లు ఆహారం తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి. జీర్ణశక్తి తగ్గడం వల్ల ఇలా చేయడం వల్ల అనేక పొట్ట సమస్యలు వస్తాయి. ఉదయం 8-9 గంటల వరకు ఖాళీ కడుపుతో ఉండటం మంచిది. అల్పాహారం కోసం మొలకెత్తిన రాగి జావ లేదా మొలకెత్తిన మిల్లెట్స్ జావ తీసుకోవడం ఉత్తమం. దీనికి తీపి కావాలంటే పంచదారకు బదులుగా ఖర్జూరం లేదా తేనెను ఉపయోగించవచ్చు. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. టీ, కాఫీల అలవాటు ఉన్నవారు, జావ తాగడానికి 5-10 నిమిషాల ముందు కొద్దిగా తీసుకోవచ్చు.
మధ్యాహ్నం తెల్ల అన్నానికి బదులుగా ఓట్స్ అన్నం తీసుకోవడం చాలా శ్రేయస్కరం. ఓట్స్ త్వరగా ఉడుకుతాయి, అధిక ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి షుగర్ స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. కూరగాయలను మెత్తగా ఉడకబెట్టి అందించాలి, ముఖ్యంగా ఆకుకూరలను ఎక్కువ మోతాదులో చేర్చాలి. ఇది రక్తహీనతను నివారిస్తుంది. చప్పగా, మెత్తగా వండిన పప్పును కూడా ఆహారంలో భాగంగా చేయాలి. నమలలేరు కాబట్టి పుల్కాలు పెద్దలకు సరిపోవు. భోజనానంతరం కాల్షియం కోసం వేయించిన నువ్వులను ముక్కాచెక్కలా చేసి ఉండలా పెడితే ఎముకలు బలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, గుడ్ కొలెస్ట్రాల్‌కు ఒక రోజు అవిసెగింజల ఉండను కూడా ఇవ్వాలి. మధ్యాహ్నం ఒక కప్పు పెరుగు తీసుకోవడం జీర్ణశక్తికి తోడ్పడుతుంది.
పెద్దలు సాయంత్రం పెందలకాడే, అంటే సుమారు 6-6:30 గంటల కల్లా ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట ఉడికించిన ఇడ్లీలు, టిఫిన్లకు బదులుగా ఫలాహారం తీసుకోవడం ఉత్తమం. ఖర్జూర పండ్లు, నానబెట్టిన అంజీరా, అరటిపండు, బొప్పాయి ముక్కలు, సపోటా, ఆపిల్ వంటి పండ్లను ఆహారంగా తీసుకోవచ్చు. కావాలంటే మెత్తగా ఉడికించిన స్వీట్ కార్న్ గింజలను కూడా చేర్చవచ్చు. రాత్రి అస్సలు ఉడికించిన ఆహారం తీసుకోకూడదని డా. మంతెన గట్టిగా సూచించారు. ఇలా చేయడం వల్ల పొట్టకు హాయిగా ఉంటుంది, జబ్బులు త్వరగా రావు. త్వరగా పడుకుంటారు కాబట్టి వారికి ఆకలి కూడా ఉండదు.
ఆహార నియమాలతో పాటు తేలికపాటి వ్యాయామాలు పెద్ద వయసు వారికి చాలా అవసరం. రాత్రి భోజనం తర్వాత అరగంట పాటు కాళ్ళు కదిలేలా నడవడం మంచిది. బయటికి వెళ్లలేకపోతే ఇంట్లోనే ఏదైనా ఆధారం పట్టుకొని నడవవచ్చు. ఇది చక్కెర స్థాయిలు పెరగకుండా, నిద్ర బాగా పట్టడానికి, జీర్ణశక్తికి సహాయపడుతుంది. ఉదయం పూట మంచం మీద కూర్చుని లేదా సోఫాలో కూర్చుని పావుగంట ప్రాణాయామం చేయడం మంచిది. తేలికైన కాళ్ళు, చేతులు కదిలించే వ్యాయామాలు, పాదాలను కదపడం వంటి సులభమైన వ్యాయామాలు చేసుకోవాలి. ఇలా రెండు పూటలా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల కాళ్ళల్లో బలం పెరుగుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి, సమతుల్యత మెరుగుపడుతుంది, తూలి పడే సమస్యలు ఉండవు.
ఈ సూచనలను పాటించడం ద్వారా వయసు పైబడిన వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, స్వతంత్రంగా జీవించగలరని పేర్కొంటున్నారు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.