
ఆ ఆధునిక యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరికీ ఒక సవాల్‌గా మారింది. అయితే మంచి ఆరోగ్యం అనేది కేవలం పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్లే కాదు.. దానిని వండే విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వంట గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, బీపీ, ఊబకాయం వంటి ముప్పులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవితం కోసం వంటింట్లో పాటించాల్సిన కొన్ని కీలకమైన చిట్కాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
చాలామంది వంట చేసేటప్పుడు కొలత లేకుండా నేరుగా ప్యాకెట్ లేదా బాటిల్ నుండి నూనెను పోస్తుంటారు. దీనివల్ల అవసరమైన దానికంటే ఎక్కువ నూనె ఆహారంలో చేరుతుంది. ఫలితంగా శరీరంలో క్యాలరీలు, కొవ్వు పెరిగి ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వంటలో ఎప్పుడూ స్పూన్ ఉపయోగించి మాత్రమే నూనె కొలిచి వేయడం అలవాటు చేసుకోవాలి.
సమోసాలు, పకోడీలు, చిప్స్, పూరీలు వంటి వేయించిన పదార్థాలు నాలుకకు రుచిగా అనిపించినప్పటికీ, వీటిలో ఫ్యాట్, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల ఊబకాయం,షుగర్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. వేపుళ్లను చాలా అరుదుగా మాత్రమే తీసుకోవాలి. వీటికి బదులుగా రోజువారీ డైట్‌లో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలను భాగం చేసుకోవాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలికి వంట వండే పద్ధతి చాలా ముఖ్యం. ఆహారాన్ని డీప్ ఫ్రై చేయడానికి బదులుగా క్రింది పద్ధతులను ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.
ఆవిరిపై: కూరగాయలను ఆవిరిపై ఉడికించడం వల్ల వాటిలోని విటమిన్లు, ఖనిజ లవణాలు వృథా కాకుండా అలాగే ఉంటాయి.
బాయిలింగ్ – గ్రిల్లింగ్: ఉడకబెట్టడం లేదా గ్రిల్, రోస్ట్ చేయడం వల్ల నూనె వినియోగం చాలా తగ్గుతుంది, పైగా ఆహారం రుచిగా ఉంటుంది.
లైట్ సాటే: తక్కువ నూనెతో తేలికగా వేయించడం లేదా ఉడకబెట్టడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
బయట దొరికే జంక్ ఫుడ్ కంటే ఇంట్లో వండుకునే తాజా భోజనమే ఎల్లప్పుడూ సురక్షితం, పోషకదాయకం. వంటింట్లో మనం తీసుకునే ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలే మనల్ని పెద్ద పెద్ద వ్యాధుల నుండి రక్షిస్తాయి.