దోసముక్కల పచ్చడి ఇలా చేస్తే రుచి అద్దిరిపోతుంది.. అన్నం 1కి రెండు 2 ప్లేట్లు తినడం పక్కా..

దోసకాయ ముక్కల పచ్చడి సాంప్రదాయ రుచులతో కూడిన సూపర్ వంటకం.. దోసకాయ ముక్కలతో పాటు వంకాయ, టమాటో, పచ్చిమిర్చి కలయికతో ఇది ప్రత్యేకమైన రుచినిస్తుంది. అన్నం, టిఫిన్‌, చపాతీ వంటి వాటిలోకి ఇది అద్భుతమైన ఎంపిక. దీనిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి, తాలింపుతో కలిపి తయారుచేస్తారు. ఈ ప్రత్యేకమైన పచ్చడి రెసిపీ గురించి తెలుసుకోండి..

దోసముక్కల పచ్చడి ఇలా చేస్తే రుచి అద్దిరిపోతుంది.. అన్నం 1కి రెండు 2 ప్లేట్లు తినడం పక్కా..
Dosakaya Pachadi Recipe

Updated on: Oct 18, 2026 | 1:43 PM

తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది.. చాలా మంది టిఫిన్ అయినా.. అన్నం అయినా.. పచ్చళ్లు తింటారు.. ముఖ్యంగా.. అత్యంత ప్రసిద్ధి చెందిన చట్నీల్లో.. దోసకాయ పచ్చడి ఒకటి.. ఎప్పుడూ చేసినా.. పుల్లగా కారంగా.. అద్భుతంగా ఉంటుంది. రుచికరమైన దోసకాయ ముక్కల పచ్చడిని ఈ పద్ధతిలో తయారుచేసి చూడండి.. దీని రుచి మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. వేడివేడి అన్నంలోకే కాకుండా టిఫిన్స్‌, చపాతీ, ఉప్మా వంటి వాటిలోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది.

వాస్తవానికి.. దోసకాయ పచ్చడిని అనేక రకాలుగా తయారు చేస్తుంటారు.. అయితే వంకాయ, టమాటో కలయికతో చేసే ఈ పద్ధతి మీకు తప్పకుండా నచ్చుతుంది.

తయారీ విధానం:

మసాలా మిశ్రమం తయారీ: ముందుగా, ఒక పాన్‌లో తగినంత నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక 10 నుంచి 15 పచ్చిమిర్చి (మీ కారానికి తగ్గట్టుగా) వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత, ఐదు నుంచి ఆరు వంకాయలను ముక్కలుగా కట్ చేసి (ఉప్పు నీటిలో ఉంచినవి) వేసుకోవాలి. వంకాయలు కండర రాకుండా అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో వంకాయలు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది.. అయితే ఇష్టం లేని వారు వీటిని మినహాయించవచ్చు. వంకాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత, నాలుగు మీడియం సైజు టమాటోలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటోలు మరీ ఎర్రగా పండినవి కాకుండా, కొంచెం గట్టిగా, ఆరెంజ్ రంగులో ఉన్నవి ఎంచుకుంటే పచ్చడి రుచి మెరుగ్గా ఉంటుంది. టమాటోలు కూడా బాగా మెత్తబడే వరకు మధ్యమధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి.

చింతపండు, పసుపు, కొత్తిమీర చేర్పు: ఇప్పుడు, ఒక పెద్ద ఉసిరికాయంత చింతపండును కడిగి వేసుకోవాలి. అలాగే, పావు టీస్పూన్ పసుపు, ఒక గుప్పెడు కొత్తిమీరను కట్ చేసి వేసి, మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో తడి పూర్తిగా పోయేంత వరకు వేయించి, స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

పోపు, దోసకాయ ముక్కల తయారీ: మరొక పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత, ముందుగా కొన్ని మెంతులు వేసి వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత, పావు టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీస్పూన్ మినపగుళ్ళు వేసి వేయించాలి. పోపు కొద్దిగా వేగాక, రెండు ఎండుమిర్చిని తుంచి, ఐదారు వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత, కొంచెం కరివేపాకు వేసి, పచ్చిదనం తగ్గిన తర్వాత పావు టీస్పూన్ ఇంగువ వేసుకోవాలి. చివరగా, ఒక మీడియం సైజు దోసకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. దోసకాయ ముక్కలను ఉడికించకూడదు.. కేవలం వేడికి కొద్దిగా మెత్తబడేలా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

గ్రైండింగ్, మిశ్రమం: ఈలోపు, మనం వేయించుకున్న వంకాయ, పచ్చిమిర్చి, టమాటో మిశ్రమం పూర్తిగా చల్లారి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులోనే ఒక టీస్పూన్ జీలకర్ర, 15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు (వంకాయ వేయించేటప్పుడు వేసిన ఉప్పును గుర్తుంచుకొని) వేసుకోవాలి. నీళ్లు ఏమీ పోయకుండా, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకుండా, కొద్దిగా బరకగా ఉంటేనే పచ్చడి రుచి బాగుంటుంది.

కలపడం: ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా తయారుచేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కల్లోకి వేసి బాగా కలపాలి. దోసకాయ ముక్కలు పూర్తిగా మెత్తబడకుండా, కాస్త కరకరలాడుతూ ఉండడం ఈ పచ్చడి ప్రత్యేకత. పచ్చడి కలిపిన తర్వాత, ఒక అరగంట పాటు అలాగే వదిలేస్తే, పచ్చడి రుచి ముక్కలకు బాగా పట్టి మరింత రుచిగా తయారవుతుంది.

అంతే, అత్యంత రుచికరమైన దోసకాయ ముక్కల పచ్చడి సిద్ధం. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే, నెయ్యి కూడా అవసరం లేదు.. ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, మీరు కూడా తప్పకుండా ఈ రుచికి ఫిదా అవుతారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us