
వేసవి రాగానే బాడీని కూల్ చేయడానికి చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రోబయోటిక్ డ్రింక్స్, ఫ్యాన్సీ హెల్త్ షేక్స్ వైపు పరిగెడుతుంటారు. కానీ, మన వంటిట్లోనే రూపాయి ఖర్చు లేకుండా దొరికే ఒక అద్భుతమైన సమ్మర్ సూపర్ ఫుడ్ ఉందనే నిజాన్ని మరచిపోతుంటారు. అదే మన ముత్తాతల కాలం నాటి రాత్రి మిగిలిన అన్నం.. మన ‘చద్దన్నం’. ప్రాంతాన్ని బట్టి దీనిని పాంతా భాత్, పఖాలా, పజయా సాదం అని విభిన్న పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం గట్ హెల్త్ (జీర్ణశక్తి) పెంచుకోవాలని భావించే హెల్త్ ఫ్రీక్స్ అందరూ ఈ ట్రెడిషనల్ ఫుడ్ గొప్పతనాన్ని తెలుసుకుని మరీ తింటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న కొంబుచా, కింఛీ వంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కంటే మన చద్దన్నం ఎంతో శక్తివంతమైనది.
రాత్రంతా అన్నం నానడం వల్ల ఇందులో పొట్టకు మేలు చేసే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) భారీగా పెరుగుతాయి. ఇది తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇదొక బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను క్లీన్ చేసి, పొట్టను ఎల్లప్పుడూ తేలికగా ఉంచుతుంది. వేసవిలో చెమట రూపంలో ఒంట్లోని నీరంతా ఆవిరైపోయి త్వరగా అలసిపోతుంటాం. చద్దన్నంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలో నీటి శాతాన్ని ఎక్కువసేపు కాపాడుతుంది. అందుకే పూర్వకాలంలో రైతులు, కూలీలు ఎండల్లోకి వేడి పనుల కోసం వెళ్లే ముందు చద్దన్నం తిని వెళ్లేవారు. దీనివల్ల వారికి రోజంతా కావాల్సిన శక్తి లభించేది.
అన్నం పులియడం వల్ల అందులోని విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాల శక్తి మరింత పెరుగుతుంది. సైన్స్ ప్రకారం.. ఫెర్మెంటేషన్ ప్రక్రియ వల్ల శరీరానికి పోషకాలను వేగంగా గ్రహించే శక్తి వస్తుంది. దీని కోసం మీరు వందలు, వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే చాలు, ఇది జీరో బడ్జెట్ ఫ్రెండ్లీ. చద్దన్నం అనగానే బోర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, దీనిని చాలా ట్రెండీగా మార్చేయొచ్చు. రాత్రి నానబెట్టిన అన్నంలో మరుసటి రోజు ఉదయం కొద్దిగా పెరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి కలిపి, మామిడికాయ ఊరగాయ నంజుకుని తింటే ఆ రుచే వేరు.
చద్దన్నం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ.. డయాబెటిస్ (షుగర్) ఉన్నవారు అన్నం క్వాంటిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే తీవ్రమైన జీర్ణ సమస్యలు లేదా ఇతర మెడికల్ కండిషన్స్ ఉన్నవారు దీనిని డైట్‌లో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. గొప్ప గొప్ప హెల్త్ సీక్రెట్స్ ఎప్పుడూ ఫ్యాన్సీ ప్యాకెట్లలో ఉండవు, మన అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషన్స్‌లోనే ఉంటాయి. ఈ సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉంచుకోవడానికి చద్దన్నం కంటే బెస్ట్ ఆప్షన్ లేదు.