
కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మాన్ని మెరిపించడంలో క్యారెట్లకు సాటి వచ్చే కూరగాయ మరొకటి లేదు. విటమిన్లు, మినరల్స్, ముఖ్యంగా విటమిన్ ఎ, బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే క్యారెట్లను మనం సాంబార్, ఫ్రైస్, సూప్‌లు లేదా జ్యూస్ రూపంలో నిత్యం తీసుకుంటాము. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం, బరువు తగ్గాలనుకునే వారికి ఫైబర్ అందించి ఆకలిని నియంత్రించడంలో క్యారెట్ ఒక సూపర్ ఫుడ్. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే అమృతం లాంటి ఈ క్యారెట్లు అందరికీ ఒకేలా ప్రయోజనకరంగా ఉండవు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు క్యారెట్లను ఎక్కువగా తింటే, అవి శరీరంలో రివర్స్ యాక్షన్ మొదలుపెట్టి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది. మరి ఏయే వ్యాధులు ఉన్నవారు క్యారెట్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం…
మూత్రపిండాల్లో రాళ్లు, ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్లతో బాధపడేవారు క్యారెట్లను తినేటప్పుడు తీవ్ర జాగ్రత్తలు వహించాలి. క్యారెట్లలో సహజంగానే ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు మరింత వేగంగా పెరిగే లేదా కొత్త రాళ్లు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి రోగులు క్యారెట్లను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
డయాబెటిక్ రోగులు పచ్చి క్యారెట్లను ముక్కలుగా మితంగా తింటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ క్యారెట్లను జ్యూస్ రూపంలో తాగడం లేదా ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. క్యారెట్లలో సహజ చక్కెరలు ఉంటాయి. వీటిని జ్యూస్ చేసినప్పుడు ఫైబర్ తగ్గిపోయి, గ్లైసీమిక్ ఇండెక్స్ పెరిగి.. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా షూట్ అప్ అవుతాయి.
గ్యాస్, అసిడిటీ, బరువు పెరగడం లేదా కడుపు ఉబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలతో సతమతమయ్యే వారు క్యారెట్లను జాగ్రత్తగా తినాలి. క్యారెట్లలో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. సాధారణంగా ఫైబర్ మంచిదే అయినప్పటికీ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు దీన్ని ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం మరియు కడుపులో తీవ్ర అసౌకర్యం పెరుగుతుంది.
బలహీనమైన కాలేయంలేదా కామెర్ల బారిన పడిన వారు క్యారెట్లను చాలా పరిమితంగానే తీసుకోవాలి. క్యారెట్లను అవసరానికి మించి ఎక్కువగా తింటే.. వాటిలోని బీటా కెరోటిన్ కాలేయం సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. దీనివల్ల ఆ కెరోటిన్ శరీరంలో పేరుకుపోయి, చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారే ప్రమాదం ఉంది. దీనిని వైద్య పరిభాషలో కరోటెనిమియా అంటారు.
కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల ఫుడ్ అలర్జీలు వస్తుంటాయి. క్యారెట్లు తిన్న తర్వాత శరీరంలో దురద, వాపు, గొంతులో గీరినట్లు అనిపించడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే.. మీకు క్యారెట్ అలర్జీ ఉన్నట్లు అర్థం. అలాంటప్పుడు వెంటనే వాటిని తినడం మానేసి డాక్టర్‌ను సంప్రదించాలి.
నియమాలకు అనుగుణంగా మితంగా తీసుకుంటే క్యారెట్ రసం శరీరానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది.
మెరిసే చర్మం: క్యారెట్ రసంలో ఉండే విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి, మొటిమలను కంట్రోల్ చేస్తాయి.
కంటి చూపు మెరుగు: వయసు పెరగడం వల్ల వచ్చే కంటి చూపు సమస్యలను నివారించి, దృష్టిని బలపరచడంలో క్యారెట్ జ్యూస్ నంబర్ 1 గా పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తి: తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడేవారికి క్యారెట్ రసం అద్భుతమైన ఎంపిక. ఇది ఇమ్యూనిటీని పెంచి రోగాలతో పోరాడే శక్తిని ఇస్తుంది.
(గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆహారాన్ని మీ రోజువారీ డైట్‌లో చేర్చుకునే ముందు ముఖ్యంగా మీకు డయాబెటిస్, కిడ్నీ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్యుడిని లేదా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి సలహా తీసుకోగలరు.)