Telugu News Lifestyle Food Banana Benefits: How One Banana a Day Can Support Nerve, Muscle and Digestive Health
నరాలకు, కండరాలకు శక్తినిచ్చే అద్భుతమైన ఫుడ్.. రోజుకు ఒక్కటి తినండి చాలు..
అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, పీచు వంటి పోషకాలు ఉంటాయి. రోజువారీ ఆహారంలో అరటిపండును చేర్చుకోవడం వల్ల నరాలు, కండరాల సాధారణ పనితీరు, జీర్ణక్రియ, శక్తి, గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి..
సామాన్యులకు చౌకగా దొరికే పండ్లలో అరటి పండు ఒకటి.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అరటిపండు.. దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచింది. ఈ పండు కేవలం చౌకగా, సులభంగా లభ్యం కావడమే కాకుండా, మన శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. ప్రతిరోజు అరటిపండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే కీలక ప్రయోజనాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
అరటిపండు.. పోషకాల గని:
అరటిపండ్లలో విటమిన్ సి, బి6, పొటాషియం, మాంగనీస్‌తో పాటు అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం నుండి నరాల, కండరాల పనితీరును మెరుగుపరచడం వరకు ఇవి ఉపయోగపడతాయి.
జీర్ణక్రియకు సహాయం: జీర్ణ సమస్యలు మరియు మలబద్ధకంతో బాధపడేవారికి అరటిపండ్లు చక్కగా సహాయపడతాయి. వీటిలో కరిగే పీచుపదార్థం (సాల్యుబుల్ ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గట్‌లో మంచి బ్యాక్టీరియాను పెంపొందించడం ద్వారా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
తక్షణ శక్తినిస్తుంది: నీరసంగా అనిపించినప్పుడు అరటిపండును తినడం ద్వారా తక్షణ మరియు స్థిరమైన శక్తిని పొందవచ్చు. అరటిపండులోని సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కేవలం రెండు అరటిపండ్లు 90 నిమిషాలకు సరిపడా శక్తిని అందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అథ్లెట్లకు అరటిపండు ఒక అద్భుతమైన చిరుతిండిగా సిఫార్సు చేయబడుతుంది.
బరువు తగ్గడంలో సహాయం: బరువు తగ్గాలనుకునే వారికి కూడా అరటిపండు సహాయకరంగా ఉంటుంది. దీంట్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పీచుపదార్థం కడుపు నిండిన అనుభూతిని కలిగించి, అనవసర ఫుడ్ క్రేవింగ్స్‌ను తగ్గిస్తుంది. ఈ విధంగా అరటిపండు బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.
రక్తపోటు నియంత్రణ: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి అరటిపండు చాలా ఉపయోగపడుతుంది. అరటిపండులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, ఇది హైపర్‌టెన్షన్, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది.
యాంటీఆక్సిడెంట్ గుణాలు: అరటిపండ్లు డోపమైన్, కాటెచిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో కీలకపాత్ర పోషిస్తాయి.
మానసిక స్థితి మెరుగుదల: అరటిపండ్లు మానసిక స్థితిని మెరుగుపరచడంలో మంచి ఫలితాన్ని అందిస్తాయి. వీటిలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెరోటోనిన్‌ను ఫీల్ గుడ్ న్యూరోట్రాన్స్‌మీటర్ అని పిలుస్తారు.. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు, నిరాశ.. ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ పరిశోధనలలో సంభావ్యత: ఒక అధ్యయనం ప్రకారం, అరటిపండులో ఉండే బయోయాక్టివ్ కాంపోనెంట్స్ క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే, కణ చక్ర బంధన, అపోప్టోసిస్.. యాంటీ-ఆంజియోజెనిక్ ప్రభావాలను ప్రదర్శించాయట. అయితే, ఈ విషయంపై మరిన్ని లోతైన పరిశోధనలు అవసరమని ఈ అధ్యయనం చెబుతుంది.
కండరాల పనితీరు.. నరాల ఆరోగ్యం: అరటిపండ్లలోని విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యంగా పొటాషియం, కండరాల సంకోచానికి.. నరాల సిగ్నలింగ్‌కు చాలా ముఖ్యమైనవి. ఇది కండరాల తిమ్మిరిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెంపు: విటమిన్ సి, బి6 వంటి పోషకాలతో కూడిన అరటిపండు, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది, తద్వారా శరీరం వ్యాధులు.. ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకుంటుంది.
చూశారుగా, అరటిపండును తినడం వల్ల కలిగే ఈ అనేక ప్రయోజనాలు. మీ ఆహారంలో అరటిపండును తప్పకుండా చేర్చుకోవాలనిపిస్తుంది కదా? అయితే, ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకోవాలనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సమాచారం వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడిని సంప్రదించి సలహాలను పాటించడం మంచిది..