
ప్రస్తుతం చాలా మంది అధిక బరువు లేదా పొట్ట సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బరువు నియంత్రణలో డైట్‌దే కీలక పాత్ర కావడంతో ఆహారంలో ఏం చేర్చుకోవాలనే గందరగోళం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు తినాలా? పనీర్ తినాలా? అనే ప్రశ్న తరచూ ఎదురవుతుంది. బరువు తగ్గడానికి కేలరీల లోటు చాలా అవసరం. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉండటమే కాకుండా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. రోజువారీ ఆహారంలో ఉడికించిన గుడ్లను లేదా తక్కువ నూనెతో వండిన గుడ్లను చేర్చుకోవడం మంచిది. కానీ గుడ్లను ఎక్కువ నూనెలో వేయించి తింటే లేదా వాటితో పాటు అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గే లక్ష్యం దెబ్బతింటుంది.
శాకాహారులకు పనీర్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం వంటి ముఖ్య పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అయితే గుడ్లతో పోలిస్తే పనీర్‌లో కొవ్వు, కేలరీల శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. రుచి బాగుంటుంది కదా అని పనీర్‌ను అతిగా తింటే బరువు తగ్గడానికి బదులు ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల పనీర్‌ను తక్కువ నూనెతో, మితంగా తీసుకోవడం మంచిది. బరువు తగ్గడం అనేది ఏ ఒక్క ఆహార పదార్థంతోనో సాధ్యమయ్యే ప్రక్రియ కాదు. దీనికి సమతుల్య ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శారీరక శ్రమ చేయడం ఎంతో ముఖ్యం.
ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి. గుడ్లు, పనీర్ రెండింటినీ సరైన మోతాదులో తీసుకుంటే కడుపు నిండినట్లు అనిపించడమే కాకుండా, బరువు కూడా అదుపులో ఉంటుంది. కానీ ఏ ఆహారాన్నైనా అధిక మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. మొత్తానికి మీ ఆహారపు అలవాట్లు, శారీరక అవసరాలకు తగినట్లుగా గుడ్లు లేదా పనీర్‌ను మితంగా తీసుకుంటూ, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు.