ఏసీ ఎముకలను వీక్ చేస్తుందా..? ఏసీలో ఉండే ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలుసుకోవాలి..

ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే నిరంతరం ఏసీ గదుల్లోనే గడపడం వల్ల ఎముకలు బలహీనపడతాయా? కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉందా? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఈ విషయంలో ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు.

ఏసీ ఎముకలను వీక్ చేస్తుందా..? ఏసీలో ఉండే ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలుసుకోవాలి..
Does Sitting In Ac Weaken Your Bones

Updated on: Jun 17, 2026 | 8:57 PM

ప్రస్తుత రోజుల్లో వేసవి వేడిని తట్టుకోవడానికి ఇళ్లలో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో.. ఇలా ఎక్కడ చూసినా ఎయిర్ కండిషనర్లను ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. అయితే ఎక్కువ సమయం ఏసీ గదుల్లోనే గడపడం వల్ల ఎముకలు బలహీనపడతాయా? మోకాళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా? అని చాలా మంది సందేహిస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ విభాగం హెడ్ అండ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎల్.తోమర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఏసీ వల్ల ఎముకలు దెబ్బతింటాయా లేదా అనే విషయాలపై ఆయన కీలక విషయాలు వెల్లడించారు.

ఏసీ వల్ల ఎముకలు నేరుగా బలహీనపడతాయా?

ఎయిర్ కండిషనింగ్ మన ఎముకలను నేరుగా బలహీనపరచదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎముకల బలం అనేది ప్రధానంగా కాల్షియం, విటమిన్ డి, సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు హార్మోన్ల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి తన సమయాన్ని ఎక్కువగా ఏసీ గదుల్లోనే గడుపుతూ, అస్సలు ఎండ తగలకుండా ఉంటే.. వారిలో తీవ్రమైన విటమిన్ డి లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. దీర్ఘకాలం పాటు విటమిన్ డి లోపం ఉండటం వల్ల ఎముకలు క్రమంగా బలహీనపడి, ఆస్టియోపొరోసిస్ అనే తీవ్రమైన ఎముకల వ్యాధికి దారితీస్తుంది. కాబట్టి ఏసీ నేరుగా కాకపోయినా, ఎండ తగలకుండా చేయడం ద్వారా పరోక్షంగా ఎముకలపై ప్రభావం చూపుతుంది.

ఏసీ వల్ల కీళ్ల నొప్పులు వస్తుందా?

ఆర్థరైటిస్ విషయానికి వస్తే.. ఏసీ గాలి వల్ల ఆర్థరైటిస్ వ్యాధి రాదు, అలాగే కీళ్లకు ఎలాంటి శాశ్వత నష్టం కూడా జరగదు. కానీ, ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రం చల్లని వాతావరణం వల్ల నొప్పులు, కీళ్ల బిగుతు, అసౌకర్యం మరింత తీవ్రతరం కావచ్చు. ఈ నొప్పి కేవలం ఉష్ణోగ్రత మరియు కండరాల బిగుతుకు సంబంధించింది మాత్రమే కానీ, వ్యాధి పెరగడం వల్ల కాదు.

ఏసీలో ఉండేవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:

ఏసీ గదుల్లో ఎక్కువ సమయం గడిపేవారు తమ ఎముకల ఆరోగ్యం కోసం ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డాక్టర్ ఎల్. తోమర్ సూచించారు.

సూర్యరశ్మి తప్పనిసరి: ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలైనా ఎండలో గడపాలి. విటమిన్ డి లభించడానికి ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్య వచ్చే సూర్యరశ్మి అత్యంత ఉత్తమమైనది. అయితే మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎండలో ఉండటం మానుకోవాలి, దీనివల్ల చర్మం కమిలిపోయే (సన్‌బర్న్) అవకాశం ఉంది.

కాల్షియం, విటమిన్ డి ఆహారం: ఎముకల బలానికి మీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. ఇందుకోసం రోజూ పాలు తాగడం, జున్ను (చీజ్), పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది. విటమిన్ డి లోపాన్ని సహజంగా అధిగమించడానికి ఆహారంలో స్వచ్ఛమైన నెయ్యిని చేర్చుకోవాలి.

వ్యాయామం -నడక: రోజంతా ఏదో ఒక శారీరక వ్యాయమం చేయాలి. కఠినమైన వ్యాయామాలు చేయలేని వారు కనీసం ప్రతిరోజూ వాకింగ్ అలవాటు చేసుకోవాలి. ఇది ఎముకలకే కాకుండా జీర్ణ వ్యవస్థ సజావుగా సాగడానికి కూడా సహాయపడుతుంది.

ఏసీ ఉష్ణోగ్రత: ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా కాకుండా 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచాలని ప్రభుత్వం కూడా సూచించింది. మరీ తక్కువ టెంపరేచర్ పెడితే ఎముకలు, కండరాలు బిగుసుకుపోతాయి. అలాగే, ఏసీలో కూర్చునేటప్పుడు ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం మానుకోవాలి.

Follow Us