
మనం ఇంట్లోనే బయట కొన్న వాటికంటే ఎంతో రుచిగా, అదనపు కరకరలాడే పప్పు చేగోడీలను ఎలా తయారు చేయాలో వివరంగా ఈ కింద తెలుసుకుందాం. ఈ రెసిపీ చాలా సులభం.. ఇది చదివిన తర్వాత మీరు కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చని అనుకుంటారు.
ముందుగా అర కప్పు పచ్చి శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కడగాలి. ఆ తర్వాత రెండు లేదా మూడు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇక్కడ నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను, పప్పు చక్కగా నానిపోయింది. నానిన పప్పు నుండి నీటిని పూర్తిగా వంపేసి, ఏదైనా శుభ్రమైన క్లాత్‌పై పప్పును తీసుకుని తడి లేకుండా తుడవాలి. లేదా ఐదు పది నిమిషాలు ఆరబెట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న శనగపప్పును పక్కన ఉంచండి. ఇంకొక గిన్నెను తీసుకుని, అందులోకి ఒక కప్పు బియ్యప్పిండిని, అర కప్పు మైదా పిండిని తీసుకోండి. బియ్యప్పిండిలో సగం మైదా పిండి వేయడం వల్ల చేగోడీలు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు కావాలంటే మొత్తం మైదా పిండి వాడి కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు పిండి మిశ్రమానికి సమానంగా నీటిని తీసుకుని వేడి చేయాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు వరకు నీళ్లను తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ కారం, అలాగే చేగోడీలు మంచి కలర్‌ఫుల్‌గా బయట కొన్నట్లు కనిపించడానికి చిటికెడు ఫుడ్ కలర్‌ని వేయండి. ఫుడ్ కలర్ ఐచ్ఛికం, మీరు కావాలంటే స్కిప్ చేయవచ్చు. నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు, మనం కలిపి పెట్టిన బియ్యప్పిండి, మైదా పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా వేయాలి. ఒక చేత్తో పిండిని వేస్తూ, మరో చేత్తో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, పిండి కాస్త చల్లారేంత వరకు మూతపెట్టి పక్కన ఉంచండి. పిండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక, ఒక పక్కకు తీసుకుని ఇందులోకి రెండు లేదా మూడు టీ స్పూన్ల నూనెను వేసి బాగా కలపాలి. ఈ పిండిలో అదనంగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీటిని చిలకరించి అయినా కలపవచ్చు. మనకు ఈ పిండి మరీ గట్టిగా కాకుండా సెమీ-సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా బాగా కలిపిన పిండి ముద్దను ఇంకొక గిన్నెలోకి తీసుకోండి.
ఇప్పుడు పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చేగోడీలను ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా ఒక కవర్‌తో మూసి ఉంచండి. తీసుకున్న పిండిని చపాతీ పీటపై పెట్టి బాగా తాలాలి. మరీ సన్నగా కాకుండా కొద్దిగా మందంగా తాలాలి. ఈ మాత్రం మందంగా ప్రిపేర్ చేస్తే శనగపప్పు బాగా పట్టుకుంటుంది. ఇలా తాలిన తర్వాత, మనం చేగోడీలను ఎంత పెద్దగా చేస్తామో దానికి సరిపడా పిండిని తీసుకుని, నానబెట్టిన శనగపప్పుపై స్లోగా రోల్ చేయాలి. శనగపప్పు పిండికి బాగా అంటుకున్న తర్వాత, రెండు చివర్లను కలిపి రింగులా చుట్టాలి. ఇలాగే మిగతా పిండి మొత్తం పప్పు చేగోడీలుగా తయారు చేసుకోవాలి. అన్ని చేగోడీలు సిద్ధం చేసుకున్న తర్వాత, వీటిని ఫ్రై చేయడానికి మరో పక్క డీప్ ఫ్రైకి సరిపడా నూనెను తీసుకుని బాగా వేడి చేయాలి. చిన్న పిండి ముద్ద వేసి చూస్తే, నూనె చక్కగా వేడిగా ఉండాలి. ఇప్పుడు నూనెలోకి సరిపడా చేగోడీలను వేయాలి. మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేస్తే, వాటికి అతికించిన పప్పు ఊడిపోవచ్చు. కాబట్టి సరిపడా మాత్రమే వేసి, వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే వేయించాలి. చేగోడీలను హై ఫ్లేమ్‌లో వేయిస్తే లోపల తడితడిగా ఉండి కరకరలాడవు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా తిప్పుతూ, పైన వచ్చే నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు వేయించాలి. నురగ తగ్గిపోయిందంటే చేగోడీలు బాగా ఫ్రై అయినట్లు.
ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి లోపలి వరకు బాగా ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఒకటి విరిచి చూడండి. లోపలి వరకు బాగా ఫ్రై అయితే చక్కగా వేయించినట్లు. ఒకవేళ తడిగా లేదా పిండిగా అనిపిస్తే మరి కాసేపు వేయించి తీసుకోండి. ఈ చిట్కా పాటించడం వలన చేగోడీలు చల్లారాక చాలా బాగా కరకరలాడుతూ, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలాగే మిగతా వాటిని కూడా వేయించుకుంటే, రుచికరమైన పప్పు చేగోడీలు తయారవుతాయి. చాలా టేస్టీగా, క్రంచీగా వచ్చిన ఈ చేగోడీలను మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ప్రయత్నించి చూడండి.