
దీపావళి సంబరాలు ముగిసినా.. టపాసుల పొగతో కలిగే ఆరోగ్య సమస్యలు మాత్రం కొందరిని ఇంకా వేధిస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, గొంతులో మంట, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. బాణసంచా కాల్చడం వల్ల వెలువడే పొగ, విషపూరిత వాయువులు, సూక్ష్మ ధూళి కణాలు శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పండుగ సమయంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో కొన్ని సందర్భాల్లో గాలి నాణ్యత సూచీ (AQI) 500 దాటడం కాలుష్య తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే దీపావళి తర్వాత వచ్చే ప్రతి దగ్గు ప్రమాదకరమైనదని భావించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు టపాసుల పొగ కారణంగా తాత్కాలికంగా గొంతు, శ్వాసనాళాల్లో చికాకు ఏర్పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో శ్వాసనాళాల్లో వాపు, ఇన్ఫెక్షన్లు లేదా ఇప్పటికే ఉన్న ఊపిరితిత్తుల సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గు ఎంతకాలం ఉంటోంది? దాని తీవ్రత ఎలా ఉంది? ఇతర లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అనే విషయాలను గమనించడం చాలా ముఖ్యం.
బాణసంచా పొగలో వివిధ రకాల లోహ అవశేషాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, PM2.5 వంటి అతి సూక్ష్మ ధూళి కణాలు ఉంటాయి. ఇవి శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు శ్వాసనాళాల లోపలి పొరపై ప్రభావం చూపి చికాకు, వాపును కలిగిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారిలో ఈ ప్రభావం కారణంగా పొడి దగ్గు, గొంతులో మంట, దురద, కళ్లలో నీళ్లు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి సాధారణంగా పొగ వల్ల ఏర్పడే తాత్కాలిక ప్రతిచర్యలు. ఇలాంటి సమస్యలు సాధారణంగా పొగకు గురైన తర్వాత ఒకటి నుంచి రెండు రోజుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అనంతరం క్రమంగా తగ్గుతూ కొన్ని రోజుల్లో లేదా వారం రోజుల్లో పూర్తిగా తగ్గిపోవచ్చు. అయితే శ్వాసనాళాల్లో వాపు మరింత లోతుగా వ్యాపిస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. శ్వాసనాళాల్లో కఫం ఎక్కువగా తయారవడం, అవి సన్నబడటం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. దీంతో దగ్గు తీవ్రంగా మారి నిద్రకు, రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజామున దగ్గు ఎక్కువగా వేధించవచ్చు. విజిల్ వేసినట్లు శ్వాస శబ్దం రావడం (Wheezing), ఛాతీలో బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొద్దిపాటి శారీరక శ్రమకే ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.
దగ్గు ఎంతకాలం కొనసాగుతుందనే విషయం సమస్య తీవ్రతను అంచనా వేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా టపాసుల పొగ వల్ల ఏర్పడే స్వల్ప చికాకు కారణంగా వచ్చే దగ్గు సుమారు ఒకటి నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోవాలి. ఈ సమయంలో లక్షణాలు క్రమంగా మెరుగుపడాలి. కానీ వారం రోజుల తర్వాత కూడా దగ్గు తగ్గకుండా మరింత ఎక్కువైతే దాన్ని సాధారణ కాలుష్య ప్రభావంగా భావించకూడదు. ఒకటి నుంచి మూడు వారాల పాటు దగ్గు కొనసాగితే వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఏర్పడే వాపు, బ్రాంకైటిస్ లేదా శ్వాసనాళాల సున్నితత్వం వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. మూడు వారాలకు మించి దగ్గు కొనసాగితే తప్పనిసరిగా ఊపిరితిత్తుల వైద్య నిపుణుడిని (Pulmonologist) సంప్రదించాలి. ముఖ్యంగా దగ్గు తగ్గుతోందా? లేక రోజురోజుకూ పెరుగుతోందా? అనే విషయాన్ని గమనించాలి.
ఇప్పటికే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారిపై టపాసుల పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), బ్రాంకైటిస్, బ్రాంకియెక్టాసిస్, క్షయవ్యాధి తర్వాత ఏర్పడిన శ్వాసనాళాల సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఆస్తమా బాధితులు పొగ, విషపూరిత వాయువులను పీల్చుకోవడం వల్ల శ్వాసనాళాలు అకస్మాత్తుగా సంకోచించే బ్రాంకోస్పాజమ్ సమస్యకు గురవుతారు. దీనివల్ల తీవ్రమైన ఆయాసం, పిల్లికూతలు, ఆస్తమా అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. COPD, బ్రాంకైటిస్ ఉన్నవారిలో ఇప్పటికే శ్వాసనాళాలు సన్నబడి, కఫం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. అలాంటి వారు టపాసుల పొగకు గురైతే కఫం మరింత పెరిగి, కొద్దిపాటి పనులు చేసినా ఆయాసం రావచ్చు. అంతేకాకుండా కఫం రంగు మారడం, ముఖ్యంగా పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారడం ఇన్ఫెక్షన్కు సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలతో పాటు జ్వరం, శ్వాస ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ న్యుమోనియా వంటి సమస్యలకు దారితీయవచ్చు.
ముఖ్యంగా పెదవులు నీలం రంగులోకి మారడం, తీవ్రమైన శ్వాస ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు సమస్య తీవ్రత పెరిగే వరకు వేచి ఉండకూడదు.
దీపావళి తర్వాత వచ్చే స్వల్ప దగ్గు, గొంతులో మంట వంటి సమస్యలు సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోవచ్చు. అయితే దగ్గు తీవ్రత పెరగడం, కఫం ఎక్కువ కావడం, పిల్లికూతలు, ఛాతీ బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఆస్తమా, COPD, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించడం ద్వారా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను నివారించుకోవచ్చని మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ – రెస్పిరేటరీ మెడిసిన్ డాక్టర్ అనూష సి.ఎం తెలిపారు.