
చలికాలం వచ్చిందంటే చలి, పొగమంచు, వాయు కాలుష్యం వంటి సమస్యలు సాధారణమైపోతాయి. అయితే ఈ కాలంలో చాలామందిని మరో సమస్య కూడా వేధిస్తుంటుంది. కళ్లలో మంట, దురద, ఎర్రబడటం, పదేపదే నీళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కళ్లలో ఏదో ఇసుక పడినట్లు అనిపించడం, కనురెప్పలు బరువుగా ఉండటం వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. చాలామంది వీటిని చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే వాయు కాలుష్యం కళ్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? తెలుసుకుందాం.
మన శరీరంలోని బయట గాలితో నేరుగా సంబంధం కలిగి ఉండే అవయవాల్లో కళ్లు కూడా ముఖ్యమైనవి. కళ్ల ఉపరితలాన్ని రక్షించడానికి కన్నీటి పొర (Tear Film) ఉంటుంది. అయితే వాయు కాలుష్యం కారణంగా ఈ రక్షణ పొర దెబ్బతినే అవకాశం ఉంది. గాలిలో ఉండే PM2.5 సూక్ష్మ ధూళి కణాలు, పొగ, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, ఇతర కాలుష్య పదార్థాలు కళ్ల ఉపరితలంపై చేరి చికాకు కలిగిస్తాయి. ఇవి అలర్జీ ప్రతిచర్యలను ప్రేరేపించడంతో పాటు కన్నీళ్లు త్వరగా ఆవిరయ్యేలా చేస్తాయి. ఫలితంగా కళ్లలో పొడిబారడం, వాపు, మంట, అసౌకర్యం వంటి సమస్యలు ఏర్పడతాయి.
కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లినప్పుడు ఈ లక్షణాలు సాధారణంగా తగ్గుతాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు, స్మాగ్ ఎక్కువగా ఉన్నప్పుడు సమస్య తీవ్రత పెరగవచ్చు.
కళ్ల మంట, దురద తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఈ జాగ్రత్తలు పాటించండి!
కళ్లలో ఎర్రదనం తగ్గించే పేరుతో ఫార్మసీల్లో లభించే రెడ్నెస్ రిలీఫ్ ఐ డ్రాప్స్‌ను వైద్యుల సలహా లేకుండా ఉపయోగించకూడదు. అలాగే గతంలో వాడిన స్టెరాయిడ్ లేదా యాంటీబయాటిక్-స్టెరాయిడ్ కలిపిన ఐ డ్రాప్స్‌ను మళ్లీ సొంతంగా వాడటం ప్రమాదకరం. స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ వల్ల కళ్లలో ఒత్తిడి పెరిగి ఆప్టిక్ నరానికి నష్టం కలగవచ్చు. ముఖ్యంగా గ్లాకోమా ఉన్నవారికి లేదా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. కొన్ని కంటి ఇన్ఫెక్షన్లను కూడా ఇవి తీవ్రతరం చేయవచ్చు. అలాగే కొన్ని రెడ్నెస్ రిలీఫ్ డ్రాప్స్ వాడినప్పుడు కళ్లలోని రక్తనాళాలు తాత్కాలికంగా కుంచించుకుపోయి ఎర్రదనం తగ్గుతుంది. అయితే వాటి ప్రభావం తగ్గిన తర్వాత మళ్లీ ఎర్రదనం పెరగవచ్చు. దీనినే రీబౌండ్ రెడ్నెస్ అంటారు. కాబట్టి కళ్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు.
కాలుష్యం వల్ల వచ్చే సాధారణ కంటి చికాకు సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోవాలి. అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా కంటి వైద్యుడిని సంప్రదించాలి.
ముఖ్యంగా కాంటాక్ట్ లెన్స్ వాడేవారికి కళ్లలో నొప్పి, ఎర్రదనం వస్తే వెంటనే లెన్స్ తొలగించి అదే రోజు వైద్య పరీక్ష చేయించుకోవాలి. ఇలాంటి ఇన్ఫెక్షన్లు వేగంగా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు, వృద్ధులు, కాంటాక్ట్ లెన్స్ వాడేవారు, కళ్ల పొడిబారడం, అలర్జీ లేదా గ్లాకోమా సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. చలికాలంలో వాయు కాలుష్యం కారణంగా కళ్లలో స్వల్ప మంట, దురద, నీళ్లు రావడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. సాధారణంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే కళ్లలో తీవ్రమైన నొప్పి, చూపు తగ్గడం, వెలుతురు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.