
నోటి పూత లేదా పుండ్ల సమస్య కారణంగా మాట్లాడాలన్నా, తినాలన్నా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమస్యలకు మందులతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పాన్ ఆకు నోటి పూతలను తగ్గించడంలో కొంతవరకు సహాయపడుతుంది. ఈ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల వాపు, మంట నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాన్ ఆకులలో అనేక సహజ సిద్ధమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, గుణాలు నోటి పూతల వల్ల కలిగే నొప్పిని, మంటను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే, నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకోవడంలో, నోటి శుభ్రతను కాపాడటంలో ఇది సహాయపడుతుంది.
మంట, వాపు తగ్గింపు: పాన్ ఆకులలో ఉండే కొన్ని ప్రత్యేక రసాయనాలు పూతల వల్ల వచ్చే వాపును తగ్గించి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
ఇన్ఫెక్షన్ నివారణ: యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల నోటిలో ఇన్ఫెక్షన్లు మరింతగా విస్తరించకుండా ఇవి అడ్డుకుంటాయి.
నోటి దుర్వాసన దూరం: తాజా పాన్ ఆకులను నమలడం వల్ల నోరు తాజాగా మారుతుంది. దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది.
నోటి పూతలకు ఉపశమనం కోసం పాన్ ఆకును ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్లో లభించే విధంగా తంబాకు, సున్నం, లేదా ఇతర హానికరమైన రసాయనాలు కలిపిన పాన్‌ను తినకూడదు.
మొదటి పద్ధతి: కేవలం తాజా, శుభ్రమైన ఒక చిన్న పాన్ ఆకును తీసుకుని నోట్లో వేసుకుని మెల్లగా నమలాలి. దాని ద్వారా వచ్చే రసం నోటి పూతలపై పడేలా చూసుకోవాలి.
రెండవ పద్ధతి: కొన్ని పాన్ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని గోరువెచ్చగా మార్చుకుని ఆ నీటితో పుక్కిలించడం వల్ల కూడా నోటి పూతలలో మంచి ఉపశమనం లభిస్తుంది.
పాన్ ఆకులు నోటి పూతలకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడంలో సహాయపడినప్పటికీ, సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం.