ఇంట్లో ఉండాల్సిన ఔషధ మొక్క.. వర్షాకాలంలో ఇలా చేస్తే తమలపాకు చెట్టు పచ్చగా గుబురుగా పెరుగుతుంది.. చాలా సింపుల్

వర్షాకాలంలో సరైన సంరక్షణతో తమలపాకు మొక్కను పచ్చగా, గుబురుగా పెంచుకోవచ్చు. సరైన కుండీ, పాక్షిక నీడ, తేమతో కూడిన నేల, సమతుల్య నీటిపారుదల, సేంద్రియ ఎరువులు వంటి చిట్కాలు పాటిస్తే మొక్క ఆరోగ్యంగా పెరిగి ఔషధ గుణాలు కలిగిన తాజా తమలపాకులను అందిస్తుంది.

ఇంట్లో ఉండాల్సిన ఔషధ మొక్క.. వర్షాకాలంలో ఇలా చేస్తే తమలపాకు చెట్టు పచ్చగా గుబురుగా పెరుగుతుంది.. చాలా సింపుల్
Betel Leaf Plant Care

Updated on: Jun 27, 2026 | 5:51 PM

తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. తమలపాకు మొక్క కేవలం ఇంటికి అందాన్ని మాత్రమే కాదు, అనేక ఔషధ గుణాలు, పోషకాలు కలిగి ఉన్న ఒక అద్భుతమైన మొక్క అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ తీగ జాతి మొక్క, మన ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఇది మనీ ప్లాంట్ మాదిరిగానే తీగలాగా పాకుతుంది. నోటి ఆరోగ్యం, జీర్ణక్రియకు తమలపాకు చాలా మంచిది. ఈ మొక్కను పెంచడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించాలి.

తమలపాకు మొక్కను ఎలా పెంచుకోవాలి.. దాని సంరక్షణ వివరాలు, ఆరోగ్య ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

తమలపాకు రకాలు – ప్రయోజనాలు

తమలపాకుల్లో దాదాపు 90 రకాలకు పైగా ఉన్నా, భారతదేశంలో 45 రకాలు సాగులో ఉన్నాయి. వీటిలో కలకత్తా పాన్, బనారసి పాన్, దేశీ పాన్ వంటివి ముఖ్యమైనవి. తమలపాకులో మెడిసినల్ వాల్యూస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల నోటిపూత, నోటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, గ్యాస్ట్రిక్, అల్సర్స్ వంటి సమస్యలు రావు. భోజనం తర్వాత పాన్ వేసుకోవడం వల్ల ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది.

మొక్కను పెంచాల్సిన ప్రదేశం – కుండీ

తమలపాకు మొక్కను కుండీలలో లేదా నేలలో పెంచుకోవచ్చు. కుండీ ఎంపికలో, బాగా లోతు ఉండే 10-12 అంగుళాల కుండీని ఎంచుకోవాలి. తీగజాతి మొక్కలకు పెద్ద కుండీ ఉంటే వేర్లు బాగా విస్తరించి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.

సూర్యరశ్మి అవసరాలు

తమలపాకు మొక్కకు ప్రత్యక్ష సూర్యరశ్మి అస్సలు నచ్చదు.. ముఖ్యంగా మధ్యాహ్నం వచ్చే ఎండ. నేరుగా ఎండ తగిలితే ఆకులు ఎండిపోయి మొక్క పాడవుతుంది. దీనికి పాక్షిక నీడ (సెమీ షేడ్) అవసరం. వెలుతురు ఎక్కువగా ఉండాలి కానీ ఎండ నేరుగా మొక్క మీద పడకూడదు. బాల్కనీలలో పెంచడానికి ఇది చాలా అనువైనది. బాగా చీకటి ప్రదేశాల్లో మొక్కను పెంచకూడదు. గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశం ఉత్తమం.

నేల మిశ్రమం – వాతావరణం

తమలపాకు మొక్కకు తేలికైన, గుల్లగా, బాగా నీరు ఇంకిపోయే నేల అవసరం. 40% మట్టి, 30% వర్మీకంపోస్ట్, 15% ఇసుక, 15% కోకోపీట్ కలిపి నేల మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా వేప పిండి మరియు ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కూడా కలపడం మంచిది. నేల ఎల్లప్పుడూ తేమగా ఉండాలి. ఈ మొక్కకు అధిక తేమ (హై హ్యూమిడిటీ) అవసరం. సముద్ర తీర ప్రాంతాలు, నదుల దగ్గర వాతావరణం దీనికి అనుకూలం.

నీటిపారుదల – మాయిశ్చర్

తమలపాకు మొక్కకు నీరు పోసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్ స్టిక్ కట్టి ఉంటే, దాన్ని తడుపుతూ నీరు పోయాలి. నేల పైన ఒకటి లేదా రెండు అంగుళాలు పొడిగా మారిన తర్వాతే నీరు పోయాలి. నేలలో తేమ ఉండటం ఇష్టం కానీ, అతిగా నీరు పోసి బురదగా చేస్తే మొక్క పాడైపోతుంది. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. వారానికి రెండు సార్లు ఆకులపై నీటిని స్ప్రే చేయండి (మిస్టింగ్). ఇది ఆకులపై ధూళిని తొలగించి, మొక్కను పచ్చగా ఉంచుతుంది. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసే నీటిలో ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కలిపి స్ప్రే చేస్తే కిరణజన్య సంయోగ క్రియ మెరుగుపడి ఆకులు మరింత పచ్చగా, మెరుస్తూ ఉంటాయి.

ఎరువుల యాజమాన్యం

తమలపాకు మొక్క కేవలం ఆకులను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి, నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఎరువులు ఇవ్వాలి. నెలకొకసారి వర్మీకంపోస్ట్ లేదా బాగా మాగిన ఆవు పేడ ఎరువు ఇవ్వచ్చు. ఒక చిన్న ఆవు పేడ ముక్కను లేదా గుప్పెడు ఆవు పేడ పొడిని ఒక లీటరు నీటిలో 24-48 గంటలు నానబెట్టి, ఆ ద్రావణాన్ని 1:2 నిష్పత్తిలో నీటితో కలిపి మొక్కకు ఇవ్వడం వల్ల మంచి పెరుగుదల ఉంటుంది. రసాయన ఎరువులు వాడకూడదు, ఎందుకంటే మనం ఆకులను ఆహారంగా తీసుకుంటాం.

ప్రొపగేషన్

తమలపాకు మొక్కను కటింగ్స్ ద్వారా సులభంగా ప్రొపగేట్ చేయవచ్చు. రెండు మూడు ఆకులు, ఒకటి లేదా రెండు నోడ్ పాయింట్స్ ఉన్న స్టెమ్ కటింగ్స్ తీసుకొని, పైన వివరించిన సాయిల్ మిక్స్ లో నాటాలి. ఒకటి లేదా రెండు నోడ్ పాయింట్స్ నేలలోపలికి వెళ్ళేలా చూసుకోవాలి. ఈ కుండీని పాక్షిక నీడలో ఉంచితే 15-20 రోజుల్లో వేర్లు వచ్చి కొత్త మొక్కలు తయారవుతాయి.

తెగుళ్లు – వ్యాధుల నివారణ

తమలపాకు ఆకుల ఘాటైన వాసన వల్ల సాధారణంగా తెగుళ్లు తక్కువగా వస్తాయి. ఒకవేళ మీలీ బగ్స్ (పిండినల్లి) లేదా రెడ్ స్పైడర్ మైట్స్ వస్తే, వేప నూనెలో ఒక చెంచా షాంపూ కలిపి వారానికి ఒకసారి మొక్క ఆకులపైన, వెనుక భాగంలో స్ప్రే చేయాలి. వేరు కుళ్లు లేదా ఫంగస్ సమస్య వస్తే, పావు చెంచా పసుపును ఒక లీటరు నీటిలో కలిపి మొక్క మొదట్లో పోయడం వల్ల ఫంగస్ తగ్గిపోతుంది.

ముఖ్యంగా వర్షాకాలం ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ తమలపాకు మొక్క ఇంట్లో ఆరోగ్యంగా, పచ్చగా, గుబురుగా పెరుగుతుంది. అయితే.. అంతగా నీటి పారుదల అవసరం ఉండదు.. ఈ విషయాలను గమనించి తమలపాకు మొక్కను ఇంట్లో సింపుల్ గా పెంచుకోండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us