
ప్రోటీన్ అనేది శరీరానికి ఒక నిర్మాణ పదార్థం. ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు అవసరమైనట్లే, శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి ప్రోటీన్ అవసరం. కానీ మనలో చాలామంది ప్రోటీన్ కంటే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. మనం తినే ఆహారంలో ప్రోటీన్ పరిమాణం తగ్గితే, అది కండరాలను మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తిని, మానసిక స్థితిని, చివరికి అందాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే ఈ కింది లక్షణాలను బట్టి గుర్తించి ఆహార అలవాట్లు మార్చుకోవల్సి ఉంటుంది.
శరీరం ఆహారం నుంచిఅవసరమైన ప్రోటీన్‌ను పొందలేనప్పుడు అది కండరాలలో నిల్వ చేయబడిన ప్రోటీన్‌ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. అప్పుడు కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా వృద్ధులు తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే శరీర శక్తి తగ్గుతుంది. దీంతో వారు త్వరగా అలసిపోతారు. అంతే కాదు వ్యాధులతో పోరాడటానికి శరీరంలోని ప్రతిరోధకాలు కూడా ప్రోటీన్‌తో తయారవుతాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. చిన్న గాయాలు కూడా నయం కావడానికి చాలా సమయం పడుతుంది.
ఎముకల విషయానికి వస్తే.. అందరూ కాల్షియం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఎముక సాంద్రతను కాపాడుకోవడంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చర్మం, జుట్టు, గోర్లు కెరాటిన్, కొల్లాజెన్ వంటి ప్రోటీన్లతో తయారవుతాయి. ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారడం, రంగు మారడం, పొడి చర్మం, పగుళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గోర్లు కూడా సులభంగా విరిగిపోతాయి. ప్రోటీన్ మనకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. భోజనం చేసినప్పటికీ మళ్లీ కాసేపటికే ఆకలిగా అనిపిస్తే లేదా స్వీట్లు తినాలని అనిపిస్తే మీ శరీరానికి తగినంత ప్రోటీన్ అందడం లేదని అర్థం. చాలా కార్బోహైడ్రేట్లు అధికంగా తిన్నప్పుడు ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు ఇది బద్ధకం పెరగడానికి కూడా కారణం అవుతుంది.
చియా గింజలు, గుమ్మడికాయ గింజలు, పాలు, పెరుగు తీసుకోవడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఇవి సహజంగానే మనకు శక్తిని అందిస్తాయి. మన ఆరోగ్యం మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్ లోపాన్ని కేవలం ఒక సమస్యగా మాత్రమే కాకుండా శరీర ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. ఈరోజు నుంచి భోజనంలో ప్రోటీన్ ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే ఆరోగ్యం క్షీణించకుండా కాపాడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.